రఘునాథపల్లి నవంబర్ 15 : కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి అధికార దాహంతోనే కాంగ్రెస్‌లో చేరారని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రఘునాథపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఎత్తులు, జిత్తులు వేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ బిహార్‌లో 110 స్థానాల్లో ప్రచారం చేస్తే కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే గెలిచారని, ప్రజల్లో ఆ పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేయడంతో హైకోర్టు మొట్టికాలు వేసిందని, అయినా, అవేం పట్టనట్లు హైడ్రా, మూసీపై రేవంత్ మాట్లాడడం సిగ్గుచేటు అని చేశారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని, స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భేషరతుగా రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.
కడియం శ్రీహరి బీఆర్ఎస్ జెండాతో గెలిచి మెడలో కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరగడం సిగ్గుచేటన్నారు. కడియం శ్రీహరిస్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాను డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలోనే రూ. 148 కోట్లతో స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి నవాబుపేట్‌కు కాల్వదారా సాగునీరు వెళ్లేందుకు కెనాల్ పనులు చేపట్టామని, దీనిని కడియం చేసినట్లుగా చెప్పుకోవడం సరికాదన్నారు. నియోజకవర్గంలో రూ. 250కోట్లతో యంగ్ ఇండియా సూల్ నిర్మించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఇప్పటివరకు కడియం శ్రీహరి దాని పట్టించుకోలేదని అన్నారు.
కడియం శ్రీహరి కాంట్రాక్టు పనుల పై శ్రద్ధను చూపినట్లుగా కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, పెన్షన్లు అందిచడంపై చూపడం లేదని అన్నారు. కడియం శ్రీహరి చేసిన అభివృద్ధి పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని, లేనిపక్షంలో గ్రామాల్లో తిరగకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి వై.కుమార్ గౌడ్, జనగామ వ్యవసాయ మారెట్ కమిటీ వైస్ చైర్మన్ మున్సిపల్ విజయ్, యూత్ మండల అధ్యక్షుడు దుబ్బాక హరీష్‌గౌడ్, జిల్లా నాయకులు గూడ కిరణ్, మండల నాయకులు ముఖ్య పరశురాములు, కొయ్యాడ స్వామి, ముప్పిడి సాంబ, పరశురాములు, శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, నునావత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.