వరంగల్ చౌరస్తా : ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ప్రసూతి సేవలను అందిస్తున్న సీకేఎం హాస్పిటల్ లో మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సీకేఎంద వాఖానలో ఐద్వా ప్రతినిధి టి భవాని అధ్యక్షతన నిర్వహించిన సర్వేలో పలు సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. ముఖ్యంగా తాగునీటి వసతితో పాటుగా మరుగుదొడ్లు నిర్వహణ లోపాలు ఉన్నాయని, వసతులు మెరుగ్గా లేవని తెలేపారు. శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి అవసరమైన రక్తాన్ని అందుబాటులో ఉంచడం కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రాన్ని వినియోగించకపోవడంపై వైద్యాధికారులను వివరణ కోరారు.
హాస్పిటల్ లో ప్రసూతి సేవలు పొందిన మహిళల నుండి అక్రమంగా నగదు వసూలు చేపట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా ప్రధాన కార్యదర్శి నల్లిగంటి రత్నమాల మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళ మంత్రి తన నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ పరిస్థితిపై దృష్టిని నిలపకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఐద్వా నిర్వహించిన ఈ సర్వే రిపోర్టును త్వరలో ప్రభుత్వానికి అందించి హాస్పిటల్ లో మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ సర్వే కార్యక్రమంలో రంగరాజు విజయ, లలిత, జరీనా, మంజుల, అనిత, తదితరులు పాల్గొన్నారు.