గత ఏడాది మురిపించిన మిరప ఈ ఏడాది రైతులకు కన్నీళ్లను తెప్పిస్తున్నది. కిందటేడాది క్వింటాలుకు సుమారు రూ.24వేల వరకు పలికిన ధర ఈ ఏడాది అమాంతం రూ.14వేలకు పడిపోవడంతో అల్లాడిపోతున్నారు. ఓ పక్క రైతుభరోసా రాక, మరోపక్క పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక మిర్చి రైతులు పంటను అమ్మాలా.. వద్దా అనే ఆలోచనలో పడిపోయారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకుంటున్నారు.
– నర్సింహులపేట/డోర్నకల్, జనవరి 31
నర్సింహులపేట/ డోర్నకల్, జనవరి 31 : గత ఏడాది మురిపించిన మిరప ఈ ఏడాది రైతులకు కన్నీళ్లను తెప్పిస్తున్నది. లక్షల్లో పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఆగమవుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదని దిగాలు చెందుతున్నారు. ఓ పక్క తెగుళ్లతో దిగుబడి తగ్గినా.. ధర ఉంటుందని ఆశ పడిన రైతులకు నిరాశే మిగిలింది. వ్యవసాయ మార్కెట్కు పెద్దఎత్తున మిర్చిపంట తరలిరావడం.. గోదాముల్లో గతేడాది పంట పేరుకుపోవడం.., అంతర్జాతీయంగా ఎగుమతులు తగ్గడంతో మిర్చిపంటకు గిట్టుబాటు ధర రావడం లేదు.
రోజురోజుకూ ధరలు పడిపోతున్నాయి. జిల్లాలో వాణిజ్య పంటల్లో మిరపది అగ్రస్థానం కాగా, తర్వాతి స్థానంలో వరి, పత్తి సాగు చేస్తున్నారు. గతేడాది మిర్చి క్వింటాలుకు రూ.24వేల వరకు ధర పలుకడంతో ఈ ఏడాది రైతులు ఎర్ర బంగారం సాగువైపు మళ్లారు. లక్షల్లో అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. జిల్లాలో ఈ ఏడాది సుమారు 55వేల ఎకరాల్లో మిర్చి తోటలు సాగు చేశారు. మెట్టభూముల్లోనూ సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. కాగా, ఈ సారి వర్షాభావ పరిస్థితులతో మిరుప మొక్కలు సరిగ్గా పెరగలేదు. పై మందులతో నెట్టుకొచ్చిన రైతుకు మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తుఫాన్ కోలుకోలేని దెబ్బతిసింది.
అయినా, వివిధ రకాల పురుగుల వాడి, కంటికి రెప్పలా పంటలను కాపాడుకున్నారు. ఎన్నో నష్టాలకోర్చి పంట పండించారు. ఇతర రాష్ర్టాల నుంచి కూలీలను తీసుకొచ్చి కిలోకు రూ.15 చొప్పున చెల్లించి పంటను ఏరించారు. చేతికొచ్చిన పంటను తీరా మార్కెట్కు తరలించే క్రమంలో ధరలేక అన్నదాత అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మిరప క్వింటాలుకు రూ. 12వేల నుంచి 14వేల వరకు ధర పడిపోవడంతో అయోమయంలో పడిపోయారు. రూ.లక్షల్లో అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని, ధర లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి ఇచ్చి ఆదుకున్నదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదికూడా ఇవ్వలేదని, అసలు రైతులను పట్టించుకోవడం లేదని దిగాలు చెందుతున్నారు.
ఎకరం 20 గుంటల్లో మిరుప తోట వేసిన. మొదట్లో వానలకు పంట ఎర్రబారింది. పురుగు మందులు కొట్టడంతో గతేడాది కంటే మంచిగా మిరుప కాసింది. కానీ, ఏం లాభం.. గత ఏడాది క్వింటా మిర్చి రూ.20వేల నుంచి రూ.24 వేలు ఉంటే, ఇప్పుడు రూ.14వేల కంటే తక్కువగా ఉంది. మిరుప కాయలు ఏరేందుకు కూలీలకు కిలోకు రూ.15 చొప్పున ఇచ్చిన. కూలీలకు కట్టించిన ధర కంటే తక్కువ ధర ఉన్నది. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎట్లా తీర్చాలి. ప్రభుత్వం మాకు రైతుబంధు కూడా ఇయ్యాలె.
– జాటోత్ దేసు, ఎర్రచకృతండా
2 ఎకరాల్లో మిర్చి వేసిన. రూ.2లక్షల పెట్టుబడి అయింది. ఇప్పుడు ధర లేక ఇబ్బంది పడుతున్నా. ప్రభుత్వ మిర్చి రైతులను పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ధాన్యం, మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించింది. కేసీఆర్ రైతులను కళ్లలో పెట్టుకొని కాపాడుకున్నరు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతుల గుండెల్లో నిలిచిపోయారు.
– పీ వెంకటేశ్వర్లు, రైతు, తోడేళ్లగూడెం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. గతం లో ఉన్న ప్రభుత్వ పథకాలకు కోత పె ట్టింది. మిర్చి ధర లేక ఇబ్బంది పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టిన ట్లు కూడా లేదు. గతం లో రూ.22 వేల వరకు మిర్చి ధర ఉండే ది. ఇప్పుడు అమాంతం పడిపోయింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. మిరుపకు గిట్టుబాటు ధర కల్పించాలి.
– బిల్లకంటి బజార్, తోడేళ్లగూడెం