సుబేదారి/హనుమకొండ చౌరస్తా/నర్సంపేట : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ శుక్రవారం హైదరాబాద్ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఉద యం బీఆర్ఎస్వీ, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఎన్నికలకు ముందు ఏటా జాబ్ క్యాలెండర్ను తప్పక అమలు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదని పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత గొంతుక వినిపించకుండా అరెస్టులు చేయడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వీ నాయకులను అక్రమంగా ముందస్తు అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమైందని, ఎన్నికల ముందు నిరుద్యోగ సమస్య పరిషారం చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసినందుకు కాంగ్రెస్ నాయకులు ముకు నేలకురాసి యువతకు క్షమాపణలు చెప్పాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువత మీద పెట్టిన అన్ని కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో బీఆర్ఎస్వీ నాయకులు రాకేశ్, పీడీఎస్ నాయకులు తస్లీమా తదితరులు ఉన్నారు.