హనుమకొండ, అక్టోబర్ 8 :‘దసరా సెలవుల్లో మాతో తిరిగిన దోస్తులంతా ఇప్పుడు సూళ్లకు పోతుంటే మేం ఇంటి దగ్గరే ఉంటున్నం. మేమేం పాపం చేశాం. బడికి వెళ్తే సార్లు రానివ్వడం లేదు. దీంతో క్లాస్‌లు మిస్సవుతున్నం. దయచేసి బకాయి ఫీజులు విడుదల చేసి మమల్ని బడిలోకి పర్మిషన్ ఇచ్చేలా చూడుండ్రి’ అంటూ బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులు వేడుకున్నారు. ఈ మేరకు తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకుందామని హనుమకొండ కలెక్టర్‌కు రాగా పోలీసులు అడ్డుకున్నారు. చేసేదేమీలేక అక్కడే ధర్నా చేసి తమ బాధను వెల్లగక్కారు.
జిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులు బుధవారం తమ పెండింగ్ ఫీజులు చెల్లించాలని రోడ్డెక్కారు. తల్లిదండ్రులతో కలిసి బుధవారం కలెక్టరేట్‌కు రాగా పోలీసులు గేట్లు మూసివేయగా, అక్కడే రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ రావాలని, పెండింగ్ ఫీజులు చెల్లించి పాఠశాలలకు పంపించాలని డిమాండ్ చేశారు. బీఏఎస్ ద్వారా ఉచితంగా మంచి చదువు అందిస్తారనే సంతోషం ఎన్నో రోజులు లేదని విద్యార్థులు వాపోయారు. రాస్తారోకోతో పోలీసులు, తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం జరిగడంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. చివరికి కొందరిని కలెక్టరేట్ లోపలికి తీసుకెళ్లి డీఆర్వో వైవీ గణేశ్‌కు వినతి పత్రం ఇప్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బీఏఎస్ బకాయిలు ఫీజలు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో అసెంబ్లీ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాగా హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ జంక్షన్లో వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బీఏఎస్ నిధులు విడుదల చేయాలని రాస్తారోకో చేపట్టారు.
వరంగల్ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా
వరంగల్ : పెండింగ్‌లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులను వెంటనే విడుదల చేయాలని విదార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఏబీఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఎంఎస్ఎఫ్ సంఘాలు పాల్గొనగా, బీజేపీ రాష్ట్ర నాయకుబు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కట్ల రాజశేఖర్ సంఘీభావం ప్రకటించారు.
మా ఫీజులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో పాఠశాల సార్లు రానివ్వడం లేదు. మూడేళ్ల ఫీజు పెండిం గ్లో ఉందని చెప్పుతున్నరు. దసరా సెలవుల తర్వాత స్కూల్ ప్రారంభమై మూడు రోజులైతాంది. నేను 10వ తరగతి చదువుతున్న. తరగతులు లాస్ అయితే పబ్లిక్ పరీక్షలు ఎలా రాయాలి? ప్రభుత్వం, సీఎం మాలాంటి వాళ్లతో ఆడుకోవద్దు.
– జ్ఞానశ్రీ, హనుమకొండ
రెండేళ్లుగా ఫీజు పెండింగ్‌లో ఉందని సార్లు బడికి రానివ్వడం లేదు. మేము దసరా సెలవుల్లో ఇంటికి పోయేటప్పుడే చెప్పిన్రు మీ పెండింగ్ ఫీజు కడితేనే పాఠశాలకు రావాలని. ఇప్పుడు మేం ఏం చేయాలో అర్థం కావడం లేదు. బీఏఎస్‌లో సీటు వచ్చిందని సంతోషంగా చేరితే ప్రభుత్వం మమ్ములను బాధ పెడుతున్నది. మా చదువులకు ఆటంకమవుతోంది. కనీసం కలెక్టర్ మేడమ్‌ను కలిసి చెబుతామంటే అనుమతిస్తలేరు.
– లోకజ్ఞ, హనుమకొండ