హనుమకొండ చౌరస్తా, జులై 24 : కాకతీయ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని ఇందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించవద్దని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
కాకతీయ యూనివర్సిటీలో పబ్లిక్ హియరింగ్‌కు వచ్చిన తెలంగాణ రాష్ర్ట విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి కాకతీయ యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐఫ్డిఎస్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, డీఎస్ఏ రాష్ర్ట కో- కన్వీనర్ మున్నా గణేష్, ఏఐఎఫ్డిఎస్ రాష్ర్ట గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, ఎస్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్, బీఎస్ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్షుడు కమ్మర్పల్లి శివ, ఏఐడిఎస్ఓ జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్, బైరపాక ప్రశాంత్ మాట్లాడుతూ 1976లో ఏర్పడిన కాకతీయ యూనివర్సిటీకీ అప్పటి రెవెన్యూ అధికారులు 720 ఎకరాలను ప్రతిపాదించగా యూనివర్సిటీకి కేవలం 670 ఎకరాలను మాత్రమే అప్పగించారని, ఈ 670ఎకరాలలో ప్రభుత్వ అవసరాలకు 72 ఎకరాలను తీసుకుందన్నారు.
ఇతరుల ఆధీనంలో 40 నుంచి 50 ఎకరాల వరకు కబ్జాలకు గురైందని, ప్రస్తుతం యూనివర్సిటీ మధ్యలో నుంచి వెళ్లిన కాకతీయ కెనాల్ పరిసర ప్రాంతాలు యూనివర్సిటీ అవసరాలైన భవనాలు, ఇతర అవసరాలకు అనుకూలంగా లేవన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇతర ప్రభుత్వ భూములలో నిర్మించాలని, విజిలెన్స్ అధికారులు చేపట్టిన సర్వే రిపోర్టును రిలీజ్ చేసి, యూనివర్సిటీకీ హద్దులు నిర్వహించి చుట్టు ప్రహరీగోడ నిర్మించాలన్నారు.
యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేయాలని, యూనివర్సిటీలో ఉన్న ఎస్ఎఫ్సీ కోర్సులను రెగ్యులర్ చేయాలన్నారు. యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతిని కల్పించాలని, యూనివర్సిటీ అభివృద్ధి కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని, విద్యార్థులకు సరిపడా నూతన హాస్టల్స్నిర్మించాలని విన్నవించారు. ఏఐఎఫ్డిఎస్ నాయకులు పోలబోయిన రాజు, డీఎస్ఏ జిల్లా కన్వీనర్ ఉప్పల శివ ఉన్నారు.