హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి రోడ్లపై చెట్లు కూలిపోవడంతో పాటు పలు ఇండ్లు, రైస్‌మిల్లులు, ఇతర పరిశ్రమలపై కప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడి సరఫరా నిలిచిపోయింది. కోతకొచ్చిన వరి నేలవాలగా, మామిడి కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. పలు కేంద్రాల్లో వరద నీరు చేరగా, రోడ్లపై, మార్కెట్లో ఎండబోసిన వడ్లు కొట్టుకుపోయాయి.
కేంద్రాల్లో బస్తాల్లో నింపి కాంటాలు పెట్టిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో అవి తడిసిముద్దయ్యాయి. దీంతో వాటిని ఆరబెట్టేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నర్మెట, స్టేషన్‌ఘన్‌పూర్, హనుమకొండ, కాజీపేట, దామెర, ఎల్కతుర్తి, ఐనవోలు, ధర్మసాగర్, ఖిలావరంగల్, నర్సంపేట, చెన్నారావుపేట, వర్ధన్నపేట, కేసముద్రం, దంతాలపల్లి, పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సంతో అపార నష్టం వాటిల్లింది.
జనగామ జిల్లా నర్మెట మండలం కన్నెబోయినగూడెంలో రైస్‌మిల్లు పైకప్పు ఎగిరిపోవడంతో అందులో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రోజులు గడుస్తున్నా కాంటాలు పెట్టడం లేదని, టార్పాలిన్లు కప్పినా భారీ గాలులకు అవి కొట్టుకుపోయి వడ్లు తడిసిపోయాయని, వెంటనే కొనాలని రైతులు అధికారులు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, ధర్మసాగర్ మండల కేంద్రంలో ఏనుగుల శ్రీనివాస్‌కు చెందిన షెడ్డు కూలిపోయి అందులో ఉన్న సుమారు 35 మేకలు మృతి చెందాయి.
– నమస్తే నెట్వర్క్, మే 6