మహబూబాబాద్ జూలై 11(నమస్తే తెలంగాణ) : వ్యవసాయంలో రైతులకు సహకారం అందించాలనే లక్ష్యంతో నిర్మించిన రైతు వేదికలకు కాంగ్రెస్ సర్కారు నిధులు కేటాయించక వాటి నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో అవి వెలవెలబోతున్నాయి. అన్నదాతలను సంఘ టితం చేసి సాగులో సలహాలు, సూ చనలు, సం క్షేమ పథకాలను అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 లో ఐదు వేల ఎకరాలకు ఓ క్లస్టర్ చొప్పున వీటిని ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణ అధికారులను అందుబాటులో ఉంచి సేవలందించింది. నిర్వహణ ఖర్చు కింద ఒక్కొక్క రైతు వేదికకు నెలకు రూ.9 వేలు మంజూరు చేసింది. వీటిలో పరిశుభ్రతకు రూ. 3వేలు, శిక్షణకు 2,500, స్టేషనరీకి రూ.వెయ్యి, విద్యుత్ చార్జికి రూ.వెయ్యి, రూ.వెయ్యి, తాగునీటికి రూ.500 చొప్పున కేటాయించాలి.
అయితే ఆగస్టు 2022 నుంచి రైతు వేదికల నిర్వహణకు నిధులు మంజూరు చేయకపోవడంతో ఏఈవోలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అప్పు తెచ్చి కొందరు, జీతం డబ్బులు ఖర్చు చేసి మరికొందరు ఆర్థిక భారంతో అవస్థలు పడుతున్నారు. కొందరు ఏఈవోలు చేతులెత్తేయడంతో రైతు వేదికలు అధ్వానంగా తయారయ్యాయి. వాటి ఆవరణ పిచ్చి మొక్కలు, దుమ్ము ధూళితో దర్శనమిస్తూ శిథిలావస్థకు చేరాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులకు రేకులు లేచిపోయాయి. ఒక్కో రైతు వేదికకు రూ. 20 వేల నుంచి రూ.40 వేల వరకు విద్యుత్ బిల్లు లు పెడింగ్‌లో ఉండగా, అధికారులు నోటీసులు కూడా అందించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 338 రైతు వేదికలు ఉండగా, రూ. 14.6 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు రైతు వేదికల నిర్వహణపై దృష్టి సారించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రతి మంగళవారం రైతు నేస్తంతో పాటు రైతు బంధు దరఖాస్తుల స్వీకరణ, ఫార్మర్ రిజిస్ట్రే షన్, యూరియా బుకింగ్, పంపిణీతో పాటు విత్తన మేళా వంటి కార్యకలాపాలు ఇక్కడ నిర్వ హిస్తున్నారు. రైతు వేదికలను నిధులు కేటాయించకపోవడంతో కొన్ని చోట్ల ఈ కార్యక్రమాలను నామమాత్రంగానే నిర్వహిస్తున్నారు. రైతులకు తాగు నీటి వసతి కూడా లేదు. కొన్ని చోట్ల ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో ఏఈవోలు తిప్పలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు వేదికకు నిధులు మంజూరు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
రైతు వేదికల నిర్వహణకు నిధులు నిలిచిపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్నచిన్న మెయింటనెన్స్ పనులు, తాగు నీరు, పరిసరాల పరిశుభ్రత వంటివి సొంత ఖర్చులతోనే చేయిస్తున్నాం. కరెంట్ బిల్లు కట్టకపోవడంతో విద్యుత్ అధికారులు నోటీసులు కూడా అందిం చారు. ప్రతి నెల తప్పకుండా నిర్వహణ నిధులు మంజూరు చేస్తే బాగుంటుంది.
– రాజు, ఏఈవోల సంఘం జిల్లా అధ్యక్షుడు, మహబూబాబాద్
నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిక అం దించాం. రైతు వేదికల్లోనే ఏఈవోలు రైతులకు సేవలు అందిస్తున్నారు. నిధులు వస్తే ఏఈవోల పై భారం తగ్గుతుంది . మరో మారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోతాం.
– స్వర్ణ విజయచంద్ర, డీఏవో, మహబూబాబాద్ జిల్లా