ఖిలా వరంగల్: బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఖిలా వరంగల్ మండల సీపీఐ మహాసభ వరంగల్ కోటలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ పాలనలో ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు దాసోహం అయ్యారని అన్నారు.
కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ ను పరుస్తూ లక్షల కోట్ల రూపాయలను రాయితీలు ఇస్తూ ప్రజల సంక్షేమం విస్మరించారన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను కేంద్రం తుంగలో తొక్కుతున్నదన్నారు. రచయితలను, కవులను, కళాకారులను, విద్యావేత్తలను అణిచివేస్తూ ప్రజాస్వామ్య మంటగలుపుతున్నారని, కేంద్రంలో జాతీయవాదం పేరుతో హిందుత్వ ఏజెండాతో ముస్లిం, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులపై విషం కక్కుతూ ప్రశ్నించే గొంతుకను నొక్కుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగం, ఆకలి, దారిద్రం నిరంతరం పెరుగుతూ పేదలకు విద్య, వైద్యం అందక ప్రజలు ఆందోళన కు గురవుతున్నా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అన్నారు.
ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం ఆదివాసీలను హత్య చేస్తున్నదని అన్నారు. అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికే ఆపరేషన్ కగార్ ను అమలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలను ఆదుకోవాలని, పేదలు వేసుకున్న గుడిసెలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించాలన్నారు.
ఈ మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్.కె.బాష్ మియా, పనాస ప్రసాద్, మండల కార్యదర్శి దండు లక్ష్మణ్, జిల్లా నాయకులు గన్నారపు రమేష్, బుస్సా రవి, తోట చంద్రకళ, సంగి ఎలేందర్, గుండెబద్రి చెన్నకేశవులు, ల్యాదెళ్ల శరత్, అక్బర్ పాషా, సుంకరి భవాని, నల్లతీగల కుమార్, చిట్యాల సువర్ణ, జన్ను రాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.