మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. భారత రాజకీయ చరిత్రలో ఆయ నది తనదైన ముద్ర వేశారు. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి. గత కాంగ్రెస్ పాలకులు ఆయనను విస్మరించినా బీఆర్ఎస్ సర్కారు పీవీకి సముచిత గౌరవం ఇచ్చింది. కేసీఆర్ హయాంలో ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించింది. నేడు పీవీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
– నర్సంపేట/భీమదేవరపల్లి, జూన్ 27
పీవీ నర్సింహారావు స్వస్థలం వంగర. ఆయన పుట్టింది మాత్రం నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామం. రుక్మిణీదేవి-సీతారామారావు దంపతులకు 1921జూన్ 28న పీవీ జన్మించారు. ప్రాథమిక విద్య వంగర, హన్మకొండలో సాగింది. కళాశాల చదువుకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ వందేమాతరం ఆలపించడంతో సహచరులతోపాటు పీవీని విశ్వవిద్యాలయం నుంచి అప్పటి నిజాం ప్రభుత్వం బహిష్కరించింది. దీంతో మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.
పీవీ నర్సింహారావు 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 1957-72 మధ్య కాలంలో నాలుగు సార్లు మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1967లో కాసు బ్రహ్మానందరెడ్డి హ యాంలో మంత్రిగా విధులు నిర్వర్తించారు. 1971 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన భూసంస్కరణలు అమలు చేసి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 1977లో హన్మకొండ లోక్‌సభకు ఎన్నికై ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో హోం, విదేశాంగ శాఖల మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ మంత్రి వర్గంలో హోం శాఖ, మానవవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో దేశ అత్యున్నత ప్రధాని పీఠాన్ని పీవీ నర్సింహారావు అధిష్టించారు. ఆ సమయంలో పీవీ తన శక్తియుక్తులు, రాజకీయ చతురతో సరళీకృత ఆర్థిక విధానం ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థను గాడిన పడేసి పునరుజ్జీవం కల్పించారు. దీంతో ఆయనకు ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు వచ్చింది. 2004 డిసెంబర్ 23న కన్ను మూశారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పీవీ నరసింహారావు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా చేపట్టిం ది. వంగరలోని పీవీ ఇంటిని అతని కుటుంబసభ్యులు పీవీ మ్యూజియంగా మార్చారు. లక్నేపల్లి గ్రామంలో ఆరు గుంటల స్థలంలో పీవీ స్మారక మందిరాన్ని (పీవీ మెమోరియల్ ట్రస్టు) నిర్మించారు. అందులో పీవీ కాంస్య విగ్రహాన్ని, పీవీ ఫొ టో గ్యాలరీని ఏర్పాటు చేశారు. నేడు వంగర, లక్నేపల్లిలో జయంతి వేడుకలు నిర్వహించనున్నారు.
దక్షిణ భారతదేశం నుంచి మొదటి ప్రధానిగా, బహుభాషా కోవిదుడిగా పీవీ పేరు గాంచా రు. ఆయన 16 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతారు. కవిగా, రచయితగా, కథకుడిగా, అనువాదకుడిగా, పాత్రికేయుడిగా, సాహిత్యానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. తన సన్నిహితుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి 1944లో కాకతీయ పత్రికను వరంగల్‌లో స్థాపించారు. 1946-1955 వరకు వారపత్రికను కొనసాగించారు.