ములుగు, మే 24 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై జిల్లా పోలీస్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా మొన్న మల్లూరులో పోలీసులు ఆటోల అద్దాలు పగులగొట్టడం, దళితుడిపై ఏటూరునాగారం ఎస్సై స్టేషన్‌కు పిలిపించి కొట్టిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.. ఈ రెండు ఘటనలు జిల్లా పోలీస్ శాఖకు మచ్చను తెచ్చిపెట్టాయి. అత్యుత్సాహం ప్రదర్శించి రెండు సంఘటనలకు కారకులైన పోలీస్ అధికారులపై ఎస్పీ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారులు నిఘా వర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్నట్లు తెలిసింది. ఎస్పీ ఆదేశాలతో ఏటూరునాగారం ఏఎస్పీ, ఇతర అధికారుల పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణ సైతం కొనసాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మేడారం మహా జాతర నుంచి ఒక సంఘటన జరిగి దానిని ప్రజలు మరిచిపోయే లోపే మరో ఘటన జరుగుతుండడం వివాదాస్పదంగా మారుతూ వస్తున్నది. కాగా, గురువారం వెలుగులోకి వచ్చిన రెండు ఘటనల్లో బాధితులతో రాజీ కుదిర్చేందుకు అధికార పార్టీ నాయకుల ద్వారా సంబంధిత అధికారులు మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.