నాడు సమైక్య పాలనలో కాజీపేట రైల్వే జంక్షన్‌ను అన్ని విధాలా నిర్లక్ష్యం చేసిన ఆంధ్రా రైల్వే ఉన్నతాధికారులు.. ఇప్పుడు డివిజన్ ఏర్పాటు విషయంలో కక్షగడుతున్నారు. కాజీపేట రైల్వే డివిజన్‌గా ఏర్పాటైతే సికింద్రాబాద్, విజయవాడలో ఉన్న అధికారులందరూ ఇక్కడే ఉండి విధులు నిర్వర్తించాల్సి వస్తుందనే కక్షతో అన్ని అర్హతలున్న కాజీపేట రైల్వే జంక్షన్‌ను రైల్వే డివిజన్‌గా కాకుండా తెరవెనుక పావులు కదుపుతున్నారు. కొంతకాలంగా అన్ని విభాగాల కార్మికులతో పాటు ముఖ్యంగా ఎల్పీలు, ఏఎల్పీలు, రైల్వే గార్డుల సంఖ్యను క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో ఎంతోకాలంగా ‘కాజీపేట డివిజన్’పై ఆశలు పెట్టుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న స్థానికులకు నిరాశ కలిగిస్తోంది.
-కాజీపేట, మార్చి 28
ఉత్తర, దక్షిణ భారతానికి ముఖద్వారంగా, రాష్ట్రం లో రెండో అతి పెద్ద రైల్వే జంక్షన్ అయిన కాజీపేట జంక్షన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట మరో రైల్వే డివిజన్‌గా ఏర్పాటవుతుందని ప్రజలందరు ఆశపడ్డా రు. డివిజన్ ఏర్పాటైతే ఇక్కడినుంచి కొన్ని కొత్త రైళ్లు ప్రారంభమవుతాయని అందరు ఆశపడ్డారు. కొత్తగా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్ యూనిట్ రావడంతో అందరిలో కాజీపేట రైల్వే డివిజన్ అవుతుందని ఆశలు చిరుగించాయి. కానీ సీమాంధ్ర పాలనలో ఆంధ్రా రైల్వే ఉన్నతాధికారులు కాజీపేట రైల్వే జంక్షన్‌ను అన్ని విధాలా నిర్లక్ష్యం చేసి, కాజీపేటను రైల్వే డివిజన్ కాకుండా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విశాఖపట్నంను సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌గా ప్రకటించడంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని విజయవాడ, గుంటూ రు, గుంతకల్ రైల్వే డివిజన్లలోకి వెళ్లితే మిగిలిన సికింద్రాబాద్, హైదరాబాద్, నాందెడ్ డివిజన్లు మాత్రమే మిగులుతాయని, అన్ని అర్హతలున్న కాజీపేట రైల్వే డివిజన్‌గా ఏర్పాటవుతుందని భావించారు.
కాజీపేట రైల్వే డివిజన్‌గా ఏర్పాటైతే సికింద్రాబాద్, విజయవాడలో ఉన్న అధికారులుందరూ కాజీపేట రైల్వే డివిజన్లో ఉండి విధులు నిర్వర్తించాల్సి వస్తుందనే కక్షతో అన్ని అర్హతలున్న కాజీపేట రైల్వే జంక్షన్‌ను రైల్వే డివిజన్‌గా కాకుండా ప్రస్తుత సీమాంధ్ర రైల్వే ఉన్నతాధికారులు పన్నాగం పట్టారు. కొంతకాలంగా కాజీపేటలోని అన్ని విభాగాల రైల్వే కార్మికులతో పాటు ముఖ్యంగా (ఎల్పీలు, ఏఎల్పీలు, రైల్వే గార్డులు)ల సంఖ్యను క్రమక్రమంగా తగిస్తూ వస్తున్నారు. గతంలో కాజీపేట రైల్వే క్రూ లాబీ దాదాపు 790మంది రైల్వే ఎల్పీలు, ఏఎల్పీలు, ఇన్స్పెక్టర్లు, రైల్వే గార్డులతో కళకళలాడేది.
రెండు రోజుల క్రితం కాజీపేట క్రూ లాబీకి ఉండాల్సిన స్టాఫ్‌లో నుంచి 90మంది లోకో పైలట్లు, 90మంది అసిస్టెంట్ లోకో పైలట్లు, ఐదుగురు లోకో ఇన్స్పెక్టర్లు కలిపి మొత్తం 185మంది రైల్వే రన్నింగ్ స్టాఫ్‌ను తగ్గిస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. గతంలో లోకో పైలట్లను విజయవాడకు తరలిస్తే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ నేతృత్వంలో నిరసనలు, ధర్నాలు, రైల్వే కార్మికులు నిరాహార దీక్షలకు దిగారు. వీరికి స్థానిక వర్తక వాణిజ్య సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు మద్దుతు తెలుపడంతో దిగొచ్చిన అధికారులు.. కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపి తరలించిన కోచింగ్ లింక్‌లను తిరిగి కాజీపేటకు రప్పించారు.
కొవిడ్ సమయం నుంచి ఇప్పటివరకు దాదాపు 248 పోస్టులను తరలించారు. ప్రస్తుతం మరోమారు 185మంది లోకో పైలట్లను ఇతర ప్రాంతాలకు తరలించే పనులను రైల్వే ఉన్నతాధికారులు వేగంగా చేస్తున్నారు. కాజీపేట డివిజన్ ఏర్పాటైతే కాజీపేట క్రూ డిపో కీలక పాత్ర పోషిస్తుందని సీమాంధ్ర అధికారులు మరోమారు లోకో రన్నింగ్ స్టాఫ్‌ను తగ్గించి, కాజీపేటను రైల్వే డివిజన్ కాకుండా తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. రైల్వే కార్మిక సంఘాల్లో ఉన్న అధినాయకత్వమంతా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే అయినందున ఆ ప్రాంతం కార్మికుల లబ్ధి కోసమే, రైల్వే ఉన్నతాధికారుల వద్ద నోరు మెదపకపోవడం వల్లే కాజీపేట రైల్వేపరంగా అన్ని విధాలా నిర్లక్ష్యానికి గురవుతున్నదని కార్మికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.