ఐనవోలు(హనుమకొండ): ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నుండి వరంగల్ వైపు సిమెంట్ బస్తాలతో వెళ్తున్న లారీ ఐనవోలు మండలం పంతిని గ్రామం హెచ్పీ పెట్రోల్ పంపు వద్దకు చేరుకోగానే.. ఎటువంటి ఇండికేషన్ ఇవ్వకుండా లారీ డ్రైవర్ సడన్గా రోడ్డుపైన లారీని నిలిపాడు. కాగా, పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖని చెందిన చింతకింది శివసాయి (29) అనే వ్యక్తి ఖమ్మంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు.
బుధవారం తెల్లవారుజామున తన సొంత కారులో ఖమ్మం నుండి వరంగల్ కు బయలుదేరాడు.
ఈ క్రమంలో సడన్ గా రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల వెలుగులో గమనించకుండా అతివేగంతో వచ్చి లారీ వెనకవైపు ఢీకొట్టాడు. దీంతో శివసాయి తలకు, ఇతర శరీర భాగాల్లో బలమైన గాయాల కారణంగా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శివ సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పటల్ తరలించారు. శివసాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.