జఫర్‌గఢ్, డిసెంబర్ 27 : ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని, మ్యానిఫెస్టోలో పేర్కొన్న 412 అంశాలను నెరవేర్చాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశం బుధవారం పార్టీ మండలాధ్యక్షుడు పల్లెపాటి జయపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఒక్కటే నెరవేర్చిందన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను నమ్మించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వైద్య కోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షల వరకు బీఆర్ఎస్ ప్రభుత్వమే పెంచి జీవో విడుదల చేసిందని శ్రీహరి గుర్తు చేశారు. రాష్ట్ర ఆదాయ వనరులు, ఆర్థిక స్థితిగతులను నిర్ధారించుకోకుండానే కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారెంటీలు, 412 హామీలతో మ్యానిఫెస్టో విడుదల చేశారని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయకుండా శ్వేతపత్రాల పేరిట బీఆర్ఎస్ పాలనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తేదీన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి నేటికీ అమలు చేయలేదన్నారు. ధాన్యానికి చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రూ.500 బోనస్ ఇస్తున్నట్లు చెప్పిన వీరు నేటికీ రాష్ట్రంలో క్వింటా ధాన్యాన్ని సేకరించలేదని శ్రీహరి విమర్శించారు. రైతుభరోసా పేరిట ఎకరానికి రూ.15 వేలు పెట్టుబడి సాయాన్ని ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా ప్రజాపాలన పేరుతో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామాల్లో సభలు నిర్వహించడం కేవలం కాలయాపన కోసమేనన్నారు. హామీలను 100 రోజుల్లో నెరవేరుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో హామీ ఇచ్చాడని గుర్తు చేస్తూ కనీసం ఆరు నెలల్లోనైనా వీటిని అమలు చేయకుంటే ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని శ్రీహరి స్పష్టం చేశారు.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి శ్రేణులు కృషి చేయాలని కోరారు. అనంతరం పార్టీ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్, జడ్పీటీసీ ఇల్లందుల బేబి, పీఏసీఎస్ చైర్మన్ తీగల కర్ణాకర్‌రావు, వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు సంపత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బ్రహ్మారెడ్డి, గుజ్జరి రాజు, నాయకులు మారుజోడు రాంబాబు, రాజేశ్‌నాయక్, కుల్లా మోహన్‌రావు, అయోధ్య, పెద్దిరెడ్డి, ఇల్లందుల శ్రీనివాస్ పాల్గొన్నారు.