హనుమకొండ, నవంబర్ 13 : ‘బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు. 42 శాతం రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రోజుకోమాట చెబుతూ కన్ఫ్యూజన్ చేస్తున్నది. రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తామంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది’ అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. గురువారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరంగల్‌లో గత నెలలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ పబ్బం కోసం వచ్చినట్టు ఉందన్నారు.
50 లక్షల జనాభా ఉన్న నగరంలో ప్రజల కోసం కనీసం మూడు గంటల సమయం కేటాయించకపోవడం బాధాకరమన్నారు. అదే జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్బంగా అక్కడ కాలుకు బలపం కట్టుకుని తిరిగాడన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల కష్టాలపై ఎటువంటి ప్రాధాన్యత ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. గత రెండు మూడు రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతూ పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా పనిచేయడం కరెక్టు కాదన్నారు. కేసీఆర్ ఏ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన తాము పోలీసు కేసులకు అదరం, బెదరమని స్పష్టం చేశారు.
అధికార యంత్రాంగం ఎప్పుడైనా సరే నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని, పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలను రెచ్చగొడితే ఉద్యమ స్థాయి నిరసనలు పునరావృతం అవుతాయని, చిన్నదాడి, అణిచివేత జరిగితే మా శక్తి చూపించాల్సి వస్తుందని అని హెచ్చరించారు. సమావేశానికి ముందుగా కాళోజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారా వు, కార్పొరేటర్లు సోదా కిరణ్, బోయినపల్లి రంజిత్‌రావు, ఇమ్మడి లోహిత, బొంగు అశోక్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్వీ నాయకుడు గండ్రకోట రాకేశ్‌యాదవ్‌ను గురువారం న్యూశాయంపేటలోని ఆయన స్వగృహంలో సిరికొండ, దాస్యం, బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా రాకేశ్‌కు, వారి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు సీపీ సన్‌ప్రీత్ సింగ్‌ను కలిసి గత రెండేళ్లలో విద్యార్థి సంఘం నాయకులపై నమోదైన కేసులను వివరించి, వీటిపై విచారణ జరిపించాలని వినతి పత్రం అందజేశారు.
ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. నాలాలు ఆక్రమించారని అంటున్న నాయిని రాజేందర్‌రెడ్డి గత రెండేళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? నాలా అక్రమ నిర్మాణం ఎవరు చేశారో త్వరలోనే బయటపెడుతాం. ఫంక్షన్లలో మిగిలింది వరద బాధితులకు అందజేయాలనడం వారిని కించపరిచనట్లే. అన్యాయం జరిగిన ప్రజల ప క్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం జనతా గ్యా రేజ్‌గా నిలిచింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడుతున్నా రు. అక్రమ కేసులను సహించేది లేదు. ఇకపై పోరాడుతాం. ధిక్కారస్వరం వినిపిస్తాం. మి త్రుడిగా నాయినికి సలహా ఇస్తున్న.. ధూమ పానం ఆరోగ్యానికి హానికరం. బహిరంగంగా సిగరెట్ కాల్చడం చట్ట విరుద్ధం. ఎన్నికల ని బంధన అతిక్రమించి జూబ్లీహిల్స్ నియోజ కవ ర్గపరిధిలో ఉండడం చట్టాన్ని అతిక్రమించడమే. దాన్ని ఎత్తిచూపితే కేసులు పెడతారా?.
– దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు