Khamenei | సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులపై తీవ్రంగా స్పందించింది. దాడులకు పాల్పడిన వారిపై కచ్చితంగా బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ కేబినెట్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఖమేనీ మృతిపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) సంతాపం తెలిపింది. తమ సుప్రీం నేతను చంపిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది. చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు జరగవచ్చని తెలిపింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పింది. కాగా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలే లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఐఆర్జీసీ సిద్ధమైనట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అలాగే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కీలక సలహాదారులు అలీ షంఖానీతో పాటు ఐఆర్జీసీ చీఫ్ మహమ్మద్ పాక్హౌర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
ఖమేనీ మృతి నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన ఇరాన్.. గంటల వ్యవధిలోనే ప్రతీకార చర్యల్ని ప్రారంభించింది. పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్కుచెందిన ఐఆర్జీసీ దళాలు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేపట్టాయి. అలాగే ఇజ్రాయెల్‌పై కూడా క్షిపణులతో విరుచుకుపడుతోంది. దుబాయి, దోహాలోని యూఎస్ స్థావరాలు, లెబనాన్‌లోని అమెరికా ఎంబసీపైనా దాడులు చేసింది.