దామెర, ఏప్రిల్ 20 : ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన మలిదశ ఉద్యమ పోరాటంలో మొట్టమొదటి రాజకీయేతర వేదిక తెలంగాణ జర్నలిస్టు వేదిక అని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజేఎఫ్దేనని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, టీయూడ బ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. టీజేఎఫ్ అవిర్భవించి మే 31నాటికి 25 ఏండ్లకు చేరుకుంటున్న సందర్భంగా రజతోత్సవ సభ నిర్వహణ కోసం టీయూడబ్ల్యూజే-హెచ్ 143 ఆధ్వర్యంలో ఆదివారం దామెర మండలం దుర్గంపేట శివారులోని ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ 2001లో టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్న నెలరోజులకే పుట్టిన మొట్టమొదటి రాజకీయ వేదిక తెలంగాణ జర్నలిస్టు వేదిక అని అన్నారు. వరంగల్ నుంచి జర్నలిస్టు సునీల్ ఆత్మ బలిదానం చేసిన చరిత్ర ఉందని, ఉద్యమం చల్లబడ్డప్పుడు కీలకంగా ఇటువంటి ఘటనలు తట్టిలేపాయన్నారు. 2001, మే 31వ తేదీన ఆవిర్భవించిన టీజేఎఫ్ వచ్చే 2025 మే 31వ తేదీ నాటికి 25 సంవత్సరాలకు చేరుకుంటుందని, అందులో భాగంగా రజతోత్సవాలను నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రజతోత్సవాలకు చేపట్టాల్సిన కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. హైదరాబాద్ వేదికగా రజతోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేశ్ హజారి, కోశాధికారి యోగానంద్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడి యా జర్నలిస్టు యూనియన్ (టెమ్జు) రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణకుమార్, సీనియర్ జర్నలిస్టు బుచ్చన్న, రాష్ట్ర నాయకులు సీహెచ్ సుధాకర్, బీఆర్ లెనిన్, తడక రాజ్‌నారాయణ, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, తుమ్మ శ్రీధర్‌రెడ్డి, కక్కెర్ల అనిల్‌కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మస్కపురి సుధాకర్, అర్షం రాజుకుమార్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యద ర్శులు ప్రశాంత్, వేణుగోపాల్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు మంచిక అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.