రుద్రంపూర్, మే 21 : కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో నూతనంగా నిర్మించిన డ్రైవర్స్ రెస్ట్ హాల్‌ను గురువారం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు ప్రారంభించారు. డ్రైవర్లకు మెరుగైన సౌకర్యాలు, విశ్రాంతికి అనుకూలమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో ఈ రెస్ట్ హాల్‌ను ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నూతన రెస్ట్ హాల్లో సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించినట్లు అధికారులు చెప్పారు. సిబ్బంది సంక్షేమం సంస్థ అభివృద్ధికి కీలకమని, డ్రైవర్లకు అవసరమైన మౌలిక వసతులు అందించేందుకు యాజమాన్యం కట్టుబడి ఉందని జీఎం వెల్లడించారు.
ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ.. తమ కోసం ప్రత్యేకంగా ఆధునిక సౌకర్యాలతో రెస్ట్ హాల్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సిబ్బంది సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న జీఎం షాలెం రాజు, ఎస్.ఓ. టు జీఎం కోటిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ. టు జి.ఎం కోటిరెడ్డి, ఏజీఎం (సివిల్) రామకృష్ణ, ఏజీఎం (ఫైనాన్స్) బీభత్స, వికేసిఎం ప్రాజెక్టు ఆఫీసర్ నరసింహారావు, డి.వై.ఎస్.ఇ రాజారాం, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, సీనియర్ పిఓ ఎం. మురళి, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్, ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు, ఇతర అధికారులు, యూనియన్ నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు.