బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన బాస్ అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బహిరంగంగా ప్రకటించారు. ఆ బాస్ కంచుకోటగా చెప్పుకొనే బాంకీపూర్నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో కమలం పార్టీ ఓడిపోయింది. జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఘన విజయం సాధించారు. ‘బీజేపీ కోటలో విజయం సాధించడం పట్ల మీ స్పందనేంటి?’ అని ప్రశాంత్ కిశోర్‌ను ఓ జర్నలిస్ట్ అడిగితే, ‘ఇది ప్రజాస్వామ్యం, ఎవరికీ కోటలు ఉండవు, కోట అనడంలోనే భూస్వామ్య మనస్తత్వం ఉన్నది’ అని వ్యాఖ్యానించారు. దేశం మొత్తం తమ సామ్రాజ్యంగా, మోదీ తమ చక్రవర్తి అన్నట్టు బీజేపీ నేతలు, కార్యకర్తలు చెప్పుకొంటారు. మూడు దశాబ్దాలుగా బాంకీపూర్‌లో బీజేపీ వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నది. కానీ ఇప్పుడు ఎదురైన ఓటమికి దేశవ్యాప్తంగా జరుగుతున్న జెన్-జీ ఉద్యమం ప్రభావం చూపినట్టు కనిపిస్తున్నది.
‘ఇది బాంకీపూర్, మా కంచుకోట, ఇక్కడ బీజేపీ కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని కమలం పార్టీ నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తంచేస్తూ వచ్చారు. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఆ పార్టీ తరఫున నీరజ్ కుమార్ పోటీ చేశారు. జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌కిశోర్ 19 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జెన్-జీ ఉద్యమం నేపథ్యంలో బిహార్ రాజధాని పాట్నా నగరంలోని నియోజకవర్గాల్లో ఒకటైన బాంకీపూర్‌లో జరిగిన ఉపఎన్నిక యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది. ఇంతకుముందు ఎన్నికల్లో ఏ సామాజిక వర్గానికి ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఎవరెవరు ఏ పార్టీకి ఓటు వేస్తారు? అనే లెక్కలు ఉండేవి. ఆ లెక్కలను పటాపంచలు చేస్తూ బాంకీపూర్ ఓటర్లు తీర్పు చెప్పారు. అయోధ్య రామాలయ హుండీ చోరీ ఘటన నుంచి బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు తాజాగా బాంకీపూర్‌లో ఓటమి ఆ జాబితాలో చేరింది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యత లభించక పోయినా అత్యధిక స్థానాలు గెల్చుకుని మిత్రపక్షాల మద్దతుతో అధికారంలో కొనసాగుతున్నది. ఇప్పుడు ఇతర పార్టీల ఎంపీలను ఈడీ, సీబీఐ వంటి అనుబంధ సంస్థల సాయంతో వరుసబెట్టి చేర్చుకుంటున్నది. బీజేపీ స్పీడ్ చూస్తుంటే గెలిచిన సీట్ల కన్నా కలుపుకొంటున్న సీట్లే ఎక్కువ అయినా ఆశ్చర్యం లేదనిపిస్తున్నది. రాజకీయ పోకడలపై ప్రజల్లో నిరాశావాదం అలుముకున్నది. ఇటువంటి పరిస్థితుల్లో జెన్-జీలు చిరుదీపమై ప్రజాస్వామ్యవాదులకు దారి చూపిస్తున్నారు.
ఈ దేశం ఇంతే అనే నిరాశావాదంలో కొందరు పెద్దలు ఉంటే, ఈ దేశం ఏ ఒక్క పార్టీదో కాదు, ఇక్కడేమీ రాచరికం లేదు. ప్రజాస్వామ్యంలో అందరూ బాధ్యతాయుతంగా ఉండాల్సిందే అని జెన్-జీ యువత ఆశావాదాన్ని చాటిచెప్తున్నారు. కొంతమంది ఉద్యమకారులపై కేసులు పెట్టిస్తూ పాలకులు ఇబ్బందులకు గురిచేయవచ్చునేమో కానీ, ఆ ఉద్యమం కలిగించిన చైతన్యం ఎక్కడికీ పోదు. జెన్-జీ ఉద్యమం రాజకీయ పక్షాల మీదనే కాదు, మీడియా మీద కూడా ఉద్యమం ప్రభావం చూపింది. ఒక్క ఢిల్లీలోనే కాదు జాతీయ మీడియా ఏ రాష్ట్రంలో కవరేజీకి వెళ్లినా దలాల్, గోదీ మీడియా అంటూ యువత నినాదాలు చేస్తున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో బాంకీపూర్ ఉపఎన్నిక ఫలితం బీజేపీ ఐటీ సెల్‌కు సైతం పెద్ద దెబ్బ కొట్టాయి. జెన్-జీ ఉద్యమం వరకు బీజేపీ ఐటీ సెల్ వాళ్లు ఎవరి మీదైనా, ఎలాంటి తప్పుడు ప్రచారమైనా చేసేవాళ్లు. వీరి ప్రచారాన్ని జెన్ జీ చాలా బలంగా ఎదుర్కొన్నది. బీజేపీ ఐటీ సెల్ తరహా ప్రచార రీల్ ఒకటి బాంకీపూర్‌లో బీజేపీ కొంప ముంచింది. ఫలితాల నిర్ణయంలో ఇది కూడా కీలక పాత్ర పోషించింది. ఐటీ సెల్ ఒక్క బీజేపీకి మాత్రమే కాదు, అందరికీ ఉన్నాయి అని ప్రశాంత్ కిశోర్ చూపించారు. మతం పేరుతో , కులం పేరుతో మూడు సార్లు అధికారంలోకి వచ్చి- ఈడీ, సీబీఐలతో అధికారాన్ని పటిష్ట పరుచుకున్న బీజేపీని జెన్-జీ ఆలోచనలో పడేసింది.
బాంకీపూర్ ఫలితంపై బీజేపీ సానుభూతిపరులు విచిత్రమైన ప్రచారం చేస్తున్నారు. వ్యూహాత్మకంగా అమిత్ షానే ఓడిపోయేటట్టు చేశారని ఓ వర్గం, మోదీ వ్యూహం అని మరో వర్గం చెప్పుకొంటున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన విశ్వగురువు మోదీ అని ప్రచారం చేసిన బీజేపీ సానుభూతిపరులకు ఇలాంటి ప్రచారం పెద్ద కష్టమేమీ కాదు. బహుశా విశ్వగురువు యుద్ధాన్ని ఆపిన విషయం తెలియక రష్యా, ఉక్రెయిన్ ఇంకా యుద్ధం చేసుకుంటూనే ఉన్నాయి. జెన్-జీ ఉద్యమం కూడా బీజేపీ వ్యూహంలో భాగం అని కూడా ఓ వర్గం బలంగా ప్రచారం చేసింది. సానుభూతి పరుల్లో ఓ వర్గం దీనిని అంతే బలంగా నమ్ముతుంది. ఇంకా మతాలను, కులాలను నమ్ముకొని ఎప్పటిలానే గెలుస్తాం అనుకుంటే పొరపాటే. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సంగతిపై దృష్టి పెట్టాలి.
ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో విద్యాశాఖ మంత్రిగా జోషీని నియమించారు. జోషీ అర్హతలు చూస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ఉద్యమించిన జెన్-జీపై ప్రతీకారంలా అనిపించింది. జోషీ చదివింది బీఏ. ఐటీ, ఏఐ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులపై అవగాహన, ఆసక్తి ఉన్నవారిని విద్యాశాఖ మంత్రిగా నియమిస్తే ప్రయోజనం ఉండేది. అలాంటి వాళ్లు బీజేపీలో లేనప్పుడు రాజకీయ రంగంలో లేనివారిని తీసుకుంటే తప్పేమిటి? రాజకీయాలతో సంబంధం లేని ఆర్థిక నిపుణుడు మన్మోహన్సింగ్ను కాంగ్రెస్ ఏకంగా ఆర్థిక మంత్రిని, ప్రధాన మంత్రిని చేసింది.
మన్మోహన్సింగ్ వల్ల దేశానికి మేలు జరిగింది. ఇప్పుడు టెక్నాలజీలో పరిణామాలను గమనిస్తే బీఏ మంత్రులతో ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. పార్టీ విధేయతకన్నా దేశ ప్రయోజనాలు ముఖ్యం. మరోవైపు ఈడీ, సీబీఐ కేసులతో ప్రత్యర్థి పార్టీలను లొంగదీసుకున్నట్టే, కేసులు, అరెస్టులతో భయపెట్టడం ద్వారా యువతను లొంగదీసుకోవాలని బీజేపీ భావిస్తున్నదేమో. కానీ బాంకీపూర్ ఉపఎన్నిక ఫలితం చూస్తే, యువత ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో, ఎలాంటి కంచుకోటలైనా బద్దలు కావడం ఖాయమని తెలుస్తున్నది. మోదీ తన బాస్ అని చెప్పుకొన్న నబీన్ ఇలాకాలోనే జెన్-జీ ఎంతటి దెబ్బకొట్టిందో కనిపిస్తూనే ఉన్నది కదా!
-బుద్దా మురళి