జైనూర్ : రైతులు తాము పండించిన జొన్న ధాన్యాన్ని ( Sorghum ) దళారులకు అమ్మి మోసపోవద్దని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ( MLA Kova Laxmi ) కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మార్కెట్ కమిటీ గోదాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్), మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో క్వింటాల్ జొన్నలకు మద్దతు ధర రూ. 3,699 ప్రభుత్వం చెల్లించి కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుమేత విశ్వనాథ్ రావు, జైనూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, జైనూర్ సహకార సంఘం చైర్మన్ కొడప హన్ను పటేల్, ఆసిఫాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట్ హాజరయ్యారు.
సర్పంచులు మడవి కౌసల్య భీమ్రావు, కుమ్ర యశోద కేశవరావు, విఠల్, ఆత్రం తులసి, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మండల అధ్యక్షులు ఇంతియాజ్ లాలా, అబ్దుల్ ముఖీద్, జైనూర్ వ్యవసాయ అధికారి ఆనందరావు, సహకార సంఘం సీఈవో సోన్కాంబ్లే జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.