వరంగల్, అక్టోబర్ 3 : ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దంపతులు ఉత్సవాలను ప్రారంభించారు. తొలిరోజు అమ్మవారిని బాలాత్రిపురసుందరిగా అలంకరించారు. ఉదయం నిత్యాహ్నికం, గణపతి పూజ, పూర్ణాభిషేకం నిర్వహించారు.
భేరీ పూజ నిర్వహించిన అనంతరం ధ్వజారోహణం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రకాళీ అమ్మవారిని ఉదయం వృషభ, సా యంత్రం మృగ వాహనంపై ఊరేగించారు. కాగా, భక్తులు బాలాత్రిపురసుందరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పోటెత్తారు. ఏర్పాట్లను ఆలయ ఈవో శేషుభారతి, సూపరింటెండెంట్ విజయ్‌కుమార్ పర్యవేక్షించారు. మాజీ సీఎం కేసీఆర్ సమర్పించిన బంగారు ఆభరణాలను అమ్మవారికి అలంకరించారు.
కాళేశ్వరం : కాళేశ్వరంలోని శుభనందాదేవి (పార్వతి), శ్రీమహా సరస్వతి అమ్మవారి ఆలయాల్లో గురువారం అర్చకులు దుర్గాదేవి మాతను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. తొలిరోజున దుర్గాదేవిని శైలపుత్రిగా అలంకరించ గా భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఈవో మారుతి, ఆలయ పర్యవేక్షకులు బుర్రి శ్రీనివాస్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.