విషజ్వరాలతో ఏజెన్సీ గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్‌తో తండాలు, గూడేలు, పల్లెల్లో ఎటుచూసినా సీజనల్ వ్యాధులతో జనం మంచంపట్టగా తల్లడిల్లుతున్నాయి. జ్వరాలు ఇలా ప్రజలపై ముప్పేట దాడి చేస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఫలితంగా రోజుకు వందల సంఖ్యలో దవాఖానల్లో చేరుతుండడంతో రోగులతో కిటకిటలాడుతున్నాయి.
ఒక్కో చోట్ల ఊళ్లకు ఊళ్లు జ్వరాల బారిన పడగా సరైన వైద్య సిబ్బంది, అరకొర సేవలతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలాచోట్ల దవాఖానల్లో ఒకే బెడ్‌పై ఇద్దరికి చికిత్స అందిస్తుండగా బదిలీలు, డిప్యుటేషన్లతో మానుకోట జిల్లా గార్ల సీహెచ్‌సీలో ఒక్క వైద్యుడే చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు అత్యవసర వైద్యం స్థానికంగా అందే పరిస్థితి లేకపోవడం, మందులు కూడా అరకొరగా ఇస్తున్నట్లు ‘నమస్తే’ ఫీల్డ్ విజిట్‌లో స్పష్టమైంది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జ్వరాల పరిస్థితిపై ప్రత్యేక కథనం..
– నమస్తే నెట్వర్క్, ఆగస్టు 26
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 26 : స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వాసుపత్రికి రోజూ 25 మంది వరకు జ్వరపీడితులు వస్తున్నారు. మీదికొండ, ఇప్పగూడెం, తాటికొండ, చిల్పూరు మండలం మల్కాపూర్ పీహెచ్సీ పరిధిలోని పలు గ్రామాల్లో విష జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. లక్షలోపు ప్లేట్లెట్స్ ఉన్న వారికి చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఆరుగురికి డెంగ్యూ పరీక్షలు చేశారు.
మరోవైపు దవాఖానలో చాలినన్ని బెడ్స్ లేక ఒక్కో మంచంపై ఇద్దరికి స్లైన్ బాటిల్ ఎక్కిస్తున్నారు. 30 పడకల నుంచి 100 పడకల దవాఖానకు మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చినా 20 బెడ్స్ కూడా లేవు. ఇటీవల ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఆర్డీవో ఆసుపత్రిని సందర్శించినా సేవలు అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనేక మంది ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయస్తున్నారు.
ఏటూరునాగారం, ఆగస్టు 26 : ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం మండలాలకు ఏకైక దిక్కుగా ఉన్న సామాజిక వైద్యశాలలో రోజు 200లకు పైగా ఓపీ ఉంటోంది. ఇందులో ఎక్కువ శాతం జ్వరాలతోనే వస్తున్నట్లు తెలుస్తోంది. బెడ్స్ సరిపోక ఎమర్జెన్సీ, ఐసీయూ వార్డులను కూడా జ్వర పీడితులకే వినియోగిస్తున్నారు. వారానికి 500లకు మందిపైగా జ్వరంతో వస్తున్నారు.
ఇక మలేరియా, టైఫాయిడ్, వైరల్, డెంగీ జ్వరాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ వైద్యశాలలో ఓపీ వివరాలు పరిశీలిస్తే 20న 140 మంది, 21న 98మంది, 22న 167, 23న 163 మంది, 24న 88 మంది జ్వరంతో వచ్చారు. అటు ప్రైవేట్ వైద్యశాలలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదునుగా గ్రామాల్లో రక్త పరీక్షల పేరిట దోపిడీ చేస్తున్నారు.
మహబూబాబాద్, ఆగస్టు26 (నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ జిల్లాలోని గంగారం, కొత్తగూడ, గూడూరు, బయ్యారం, గార్ల ఏజెన్సీ మండలాలుగా ఉన్నాయి. ఈ ఏజెన్సీ మండలాల పరిధిలోని తండాలు, గూడేల్లో ప్రజలు జ్వరాలు ప్రబలి అరిగోస పడుతున్నారు. సోమవారం నమస్తే తెలంగాణ బృందం గార్ల మండల కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రా న్ని సందర్శించింది. ఇక్కడి 30 పడకల దవాఖానలో 10మంది వైద్యులకు గాను కేవలం ఒకే ఒక్కరే ఉండగా రోజుకు సుమారు 200 మంది ఓపీ చూడాల్సి వస్తోంది. ఎక్కువ మంది జ్వరంతోనే దవాఖానలో చేరుతున్నారు. అయితే రోగులను ఉదయం, సాయంత్రం పరీక్షించాల్సి ఉండ గా గార్ల సీహెచ్‌సీని ఒక్కరే నడిపించాల్సి పరిస్థితి నెలకొంది.
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేసి రూ.5కోట్లతో అధనాతన హంగులతో 30 పడకల ఆసుపత్రిని నిర్మించారు. అంతేగాక అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించి 10 మంది వైద్యులను కూడా నియమించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందిని బదిలీ చేయగా, మరికొందరు డిప్యుటేషన్‌పై వెళ్లారు. ఫలితంగా ఇప్పుడు కేవలం ఒక్క డాక్టరే మిగిలారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ డాక్టర్ అందుబాటులో ఉంటూ తర్వాత స్టాఫ్ నర్సు, నర్సులే రోగులకు దిక్కయ్యారు. రాత్రివేళ అత్యవసర వైద్యంతోపాటు జ్వరపీడితులకు రక్త పరీక్షలు చేయాలన్నా జిల్లా దవాఖానకు పంపించాల్సిందే. అంతేగాక రోగులకు అటు సేవలతో పాటు మందులు కూడా అరకొరగా ఇస్తున్నారు.
నా వేలికి దెబ్బ తగిలితే చికిత్స కోసం గార్లలోని ఆసుపత్రికి వచ్చాను. ఉదయం 8గంటలకు ఆసుపత్రికి వచ్చి లైనులో నిలుచుంటే నా సీరియల్ వచ్చే సరికి మధ్యాహ్నం అయ్యింది. ఒక్క డాక్టరే అన్ని రోగాలకు చికిత్స చేస్తున్నాడు. డాక్టర్లు లేక ఇక్కడ రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రకాల డాక్టర్లు లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలపై నిర్లక్ష్యం చేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక ఇక్కడికి వచ్చిన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వస్తే సాయంత్రానికి కానీ వెళ్లే పరిస్థితి లేదు. అన్ని రకాల డాక్టర్లను ఇక్కడ నియమించాలి.
– మంద భిక్షం, రోగి, యాదనాయకపురం