ములుగు, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. అంతుచిక్కని రోగాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కీళ్ల నొప్పులు, జ్వరం, దగ్గు, జలుబుతోపాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానతోపాటు ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో వైద్యులు సమయానుకూలంగా వస్తున్నప్పటికీ సౌకర్యాల లేమితో సేవలందించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మందుల సరఫరా లేక, ల్యాబ్ రిపోర్టులు సమయానికి అందక రోగులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 80 శాతం మేర రక్త, మూత్ర పరీక్షలు ప్రభుత్వ దవాఖానల్లో చేస్తున్నప్పటికీ కొన్నిచోట్ల ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. మందుల సరఫరా చాలినంత లేకపోవడంతో రోగులు కొన్నింటిని ప్రైవేట్‌లో కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 22 డెంగ్యూ, 45 మలేరియా, 65 టైయిఫాడ్ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య వెల్లడించారు.
ములుగు ప్రభుత్వ దవాఖానలో రోగ నిర్ధారణ పరీక్షల కోసం మూడేళ్ల క్రితం టీ డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పా టు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కొన్ని పీహెచ్‌సీల పరిధిలోని రోగులకు ఉచితంగా 57 రకాల రక్త, మూత్ర పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇందులోని యంత్రాలు మరమ్మతుకు గురవడంతో పరీక్షలు నిలిచిపోయాయి.
దీంతో ఇక్కడి రోగుల రక్త నమూనాలను వరంగల్‌కు తరలిస్తున్నారు. వెంకటాపురం (నూగూరు) మండలంలోని సివిల్ దవాఖానకు ప్రతి రోజూ 200 మంది వస్తుండగా, అందులో దాదాపు 15 మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. ఈ దవాఖానలో కేవలం నలుగురు ఎంబీబీఎస్ వైద్యులు మాత్రమే ఉండటంతో వారిపై పని ఒత్తిడి పెరుగుతున్నది. ఒకే బెడ్‌పై ఇద్దరికి వైద్య సేవలందిస్తున్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లో యథావిధిగా వైద్య సేవలు కొనసాగుతున్నాయి.