హనుమకొండ, మే 19 : భానుడు భగ్గుమంటున్నాడు. ఉగ్రరూపంతో సెగలు కక్కుతున్నాడు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతన్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సారి మార్చి నెల నుంచి భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండివేడి మొదలై 9 గంటల కల్లా సూరీడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నమైతే మాడు పగిలే ఎండతో జనం అల్లాడిపోతున్నారు.

మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదైంది. మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. సాయంత్రం 6 గంటలు దాటినా కూడా ఎండ దగడు తగ్గడం లేదు. ఎండవేడి, వడగాలుల తీవ్రతతో ప్రజలు ఉపశమనం కోసం ఏసీలు, కూలర్ల ఏర్పాటు చేసుకున్నా పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఏటా ఏప్రిల్ నెలాఖరులో.. లేదా మే నెలలో ఎండలు పెరిగేవి. కానీ ఈ సారి మార్చి నెల నుంచే ఎండలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని (44 నుంచి 45 డిగ్రీల వరకు) వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
మధ్యాహ్నం వేళల్లో ఎండవేడి ఎక్కువగా ఉండడంతో గ్రామాల్లో ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. పట్టణ ప్రాంతల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోత, వడగాలులతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందిపడుతున్నారు. గ్రామాల్లో వ్యవసాయ, ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు ఉదయం 5 గంటలకు వెళ్లి సాధ్యమైనంత మేరకు ఉదయమే పనులు ముగించుకొని 11 గంటలలోపు ఇండ్లలోకి చేరుతున్నారు. ఎండలో తప్పనిసరి బయటికి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
గత 6 రోజులుగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలు
13వ తేదీన 43.4
14వ తేదిన 41.6
15వ తేదీన 41.9
16వ తేదీన 40.8
17వ తేదీన 41.2
18వ తేదీన 42.4