హైదరాబాద్, ఆగస్టు 19, (నమస్తే తెలంగాణ): తమ న్యాయమైన హకుల సాధన కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడమే కాకుండా, వారి గొంతునొక్కడం హత్యాయత్నమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మహబూబాబాద్‌లో ‘శక్తి’ సీమ్‌ను, జీవో97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసుల నిర్బం ధం, లాఠీచార్జికి దిగడాన్ని ఎక్స్ వేదికగా హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ఖండించారు.
మహబూబాబాద్‌లో విద్యార్థుల గొంతు నొక్కుతూ క్రూరంగా వ్యవహరించిన పోలీస్ అధికారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే జీవో97, ‘శక్తి’ పథకాన్ని ఉపసంహరించుకొని విద్యార్థుల సమస్యలను పరిషరించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన హకుల కోసం విద్యార్థులు రోడ్డెకితే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేసేందుకు యత్నిస్తున్నదని, ప్రశ్నించే విద్యార్థుల గొంతును పిసికేలా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదని విమర్శించారు. విద్యార్థులన్నా,నిరుద్యోగులన్నా సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకంత కక్ష? అని ప్రశ్నించారు.నిరుద్యోగులపై, విద్యార్థులపై జరుగుతన్న లాఠీచార్జి ఘటనలు, పోలీసుల అమానుష ప్రవర్తన.. రేవంత్ పాలనకు అద్దం పడుతున్నాయని మండిపడ్డారు.
విద్యార్థులు, నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో సమాధానం చెప్పాలని హరీశ్‌రావు నిలదీశారు. హకుల సాధన కోసం పోరాడే వారిపై లాఠీలు ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. విద్యార్థులపై చేయిపడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.