ముంబై, ఆగస్టు 19: దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భగ్గుమంటుండటం, అమెరికా-ఇరాన్ దేశాలు కాల్పుల విరమణ ముగిసిన తర్వాత దౌత్యపరమైన పరిష్కారం లభించకపోవడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. దీంతో వరుసగా నాలుగోరోజూ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఒక దశలో 400 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 77 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది.
చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 325.78 పాయింట్ల నష్టంతో 76,909.68 వద్ద స్థిరపడింది. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 1,170.28 పాయింట్లు లేదా 1.49 శాతం నష్టపోయినట్టు అయింది. మరో సూచీ నిఫ్టీ వరుసగా ఏడోరోజూ బుధవారం కూడా నష్టపోయింది. 76.60 పాయింట్లు కోల్పోయిన సూచీ చివరకు 24,078.30 వద్దకు జారుకున్నది. గత ఏడు సెషన్లలో నిఫ్టీ 505.5 పాయింట్లు లేదా 2 శాతం కోల్పోయింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఎలాంటి అర్థవంతమైన దౌత్యపరమైన పురోగతి లేకుండా ముగియడంతో ఇంధన సరఫరాలకు మళ్లీ అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళనలు తలెత్తాయి. ఇది ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నదని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.