సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఊబిలో కూరుకుపోయింది. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఎన్నికల కమిషనర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ హియరింగ్స్ హైదరాబాద్ నగరంలో ఆశించిన రీతిలో సాగడం లేదు. అధికారుల నుంచి నోటీసులు అందినా, క్షేత్రస్థాయికి వెళ్లి విచారణకు హాజరయ్యేందుకు జనం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో కేటాయించిన సమయం ముగిసిపోయి లక్షలాది మంది ఓటర్ల హియరింగ్ తేదీలు ల్యాప్స్ అయిపోయాయి. తిరిగి తేదీని రీషెడ్యూల్ చేసుకునేందుకు కూడా ఓటర్ల నుంచి స్పందన లేకపోవడంతో మొత్తం ప్రక్రియే ప్రశ్నార్థకంగా మారుతోంది.
హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల పరిధిలో 12,53,876 మంది ఓటర్లకు నోటీసులు జనరేట్ చేయగా, ఇప్పటివరకు 12,04,498 మందికి నోటీసులు జారీ చేశారు. వీటిలో ఇప్పటివరకు 6.49 లక్షల మంది ఓటర్లకు మాత్రమే హియరింగ్ పూర్తయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు 4,79,880 మంది ఓటర్లకు కేటాయించిన హియరింగ్ తేదీలు ముగిసిపోగా, డేట్ రీషెడ్యూల్ చేసుకున్న వారు కేవలం 796 మందే కావడం గమనార్హం. కాగా నిర్ణయించిన తేదీల్లో విచారణకు హాజరుకాకపోవడంతో వారి హియరింగ్ తేదీలు ల్యాప్స్ అయ్యాయి. దీంతో వీరికి తిరిగి అవకాశం కల్పించాలంటే రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మేడ్చల్‌లో భారీగా పెండింగ్
మేడ్చల్-మలాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14,07,352 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. వీటిలో 11,35,946 మందికి నోటీసులు అందజేశారు. ఇంకా 2,71,406 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో 5,68,167 మంది విచారణ పూర్తయ్యింది. మరో 7,81,892 మంది విచారణ తేదీలు ముగిసిపోయాయి. వీరిలో కేవలం 40,106 మంది మాత్రమే విచారణ తేదీని రీషెడ్యూల్ చేసుకున్నారు.
రంగారెడ్డిలోనూ ఇదే పరిస్థితి..
రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,33,490 మంది ఓటర్లకు ఎస్ఐఆర్-2002 వివరాలు సక్రమంగా లేవని నోటీసులు జారీ చేశారు. వీటిలో 9,45,205 మందికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటివరకు 5,75,194 మంది విచారణలకు హాజరయ్యారు. మరో 5,78,907 మంది విచారణకు హాజరుకాలేదు. గైర్హాజరైన వారిలో కేవలం 680 మంది మాత్రమే తమ విచారణలను రీషెడ్యూల్ చేసుకోవడం గమనార్హం.
స్పష్టత కొరవడటమే కారణమా?
రాజధాని పరిధిలో సర్ హియరింగ్స్ మందకొడిగా సాగుతుండటంపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయి అధికారులు ప్రతిరోజూ నిర్దేశిత సంఖ్యలో విచారణలు పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే, విచారణకు ఓటర్లు రాకపోవడానికి ప్రధానంగా అవగాహన రాహిత్యమే కారణమనే విమర్శలు వస్తున్నాయి. హియరింగ్‌కు హాజరయ్యే సమయంలో ఏయే ఆధారాలు సమర్పించాలి? ఎలాంటి పత్రాలు వెంట తెచ్చుకోవాలి? అనే అంశంపై స్పష్టమైన ప్రచారం లేకకపోవడంతోనే ప్రజలు వెనకాడుతున్నారని తెలుస్తోంది. అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి రీషెడ్యూల్‌పై అవగాహన కల్పించకపోతే, తుది ఓటర్ల జాబితా రూపకల్పనపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదముంది.