దేశంలో విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, నియామక ప్రక్రియల్లో అవకతవకలు, ప్రభుత్వాల మౌనం ఇవన్నీ యువతలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి జార్ఖండ్ రాజధాని రాంచీ వరకు వినిపిస్తున్న విద్యార్థుల గొంతులో ఒకే ఆవేదన ప్రతిధ్వనిస్తున్నది. మా భవిష్యత్తుతో ఆటలాడవద్దు.. మా జీవితాలను బలిచేయవద్దు అని. కానీ పాలకపక్షాలు ఢిల్లీలో ఒకలా గల్లీలో ఒకలా ప్రవర్తిస్తూ దొంగాట ఆడుతున్నాయి.
ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. పార్లమెంటులో ప్రశ్నించారు. రోడ్డు మీదకు వచ్చారు. ప్రధానమంత్రి నివాసం వద్ద నిరసనకు దిగారు. మరోవైపు జార్ఖండ్లో ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. జూలై 29న రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి విద్యార్థుల భారీ ర్యాలీ బయలుదేరింది. పరీక్షలను రద్దు చేయాలని, అక్రమాలపై విచారణ జరపాలని, నియామక ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఆగస్టు 10న అసెంబ్లీ వైపు కదిలిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.
పరిస్థితి ఉద్రిక్తం కావడంతో లాఠీలు, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ఉపయోగించారు. జార్ఖండ్లో జేఎంఎం పార్టీ అధికారంలో ఉన్నది. ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి. ఇక్కడే రాజకీయాల అసలు ముఖం కనిపిస్తుంది. అధికారం మారితే న్యాయ ప్రమాణం కూడా మారాలా? ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థుల గొంతు ప్రజాస్వామ్య హక్కుగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అదే గొంతు ‘శాంతిభద్రతల సమస్య’గా కనిపిస్తే, ప్రజాస్వామ్యానికి అర్థమేంటి? ఈ ప్రశ్న బీజేపీని ఎంతగా వెంటాడుతున్నదో కాంగ్రెస్ను కూడా అంతే వెంటాడాలి. విద్యార్థి ఉద్యమం అంటే బీజేపీకి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్కు అనుకూలం కాదు. వామపక్షాలకు మాత్రమే చెందినదీ కాదు. అది విద్యార్థుల జీవితాలకు సంబంధించినది. దానిని ఏ రాజకీయ పార్టీ తన ఖాతాలో వేసుకోవాలనుకున్నా, ఆ ఉద్యమం అసలు స్వభావాన్ని చిన్నబుచ్చినట్టే.
ఈ ఉద్యమాల వెనుక ఉన్న యువతను ఒకసారి నిశితంగా గమనించాలి. వాళ్లు ప్రభుత్వాన్ని పడగొట్టి తాము అధికారంలోకి రావాలని అనుకోవడంలేదు. వాళ్లు మంత్రిపదవులు కోరడం లేదు. వాళ్లు రాజ్యాధికారం కోసం పోరాడటం లేదు. విద్యార్థులు అడుగుతున్నది.. పరీక్షలు నిజాయితీగా నిర్వహించండి! ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా చూడండి. అక్రమాలు జరిగితే బాధ్యులను శిక్షించండి. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చూడండి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయండి అని మాత్రమే.
ఢిల్లీ, రాంచీ ఉద్యమాల సందర్భంగా మీడియా కవరేజీలో కనిపించిన వ్యత్యాసాలపై కూడా చర్చ జరిగింది. ఢిల్లీ ఉద్యమానికి జాతీయ స్థాయిలో లభించిన రాజకీయ, మీడియా ప్రాధాన్యతతో పోలిస్తే జార్ఖండ్ ఉద్యమానికి లభించిన ప్రాధాన్యతపై ప్రశ్నలు వచ్చాయి. అయితే మొత్తం మీడియాను ఒకే గాటన కట్టడం కంటే ఒక సాధారణ ప్రమాణాన్ని గుర్తు చేయడం మంచిది. విద్యార్థి సమస్యను పార్టీ దృష్టితో కాకుండా, ప్రజా ప్రయోజనాల దృష్టిలో చూడాలి. బీజేపీ, కాంగ్రెస్, జేఎంఎం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా విద్యార్థుల ప్రశ్నకు సమానమైన ప్రాధాన్యత దక్కాలి.
ప్రజా ఉద్యమాల చరిత్ర ఒక విషయాన్ని పదేపదే నిరూపించింది. ఒక ఉద్యమాన్ని బలప్రయోగంతో కొంతకాలం ఆపవచ్చు. కానీ దాని కారణాన్ని పరిష్కరించకుండా ఆపిన ఉద్యమం మళ్లీ తలెత్తుతుంది. ఒక బంతిని నేలకేసి ఎంత బలంగా కొడితే, అది అంతే వేగంగా పైకి లేస్తుంది. అణచివేత తీవ్రత పెరిగిన కొద్దీ, అసంతృప్తి మరింత లోతుకు వెళ్తుంది. లాఠీ ఒక శరీరాన్ని గాయపరచగలదు. టియర్ గ్యాస్ ఒక సమూహాన్ని చెదరగొట్టగలదు. అరెస్టులు ఒక రోజు ఉద్యమాన్ని నిలిపివేయగలవు. కానీ యువత మనసులో పుట్టిన ప్రశ్నను మాత్రం అవేవీ చంపలేవు. అందుకే ఏ ప్రభుత్వమైనా ఈ ఉద్యమాలను ‘శాంతిభద్రతల సమస్య’గా చూడటం దూరదృష్టి లేని చర్య.
విద్యార్థుల ఉద్యమం ఒక సామాజిక హెచ్చరిక. రేపటి మార్పునకు సంకేతం? ఈ రోజు పారదర్శకమైన పరీక్షల నిర్వహణ కోసం, ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన యువత రేపు దేశ పరిపాలనను ప్రశ్నించే పౌరసమాజంగా ఎదుగుతుంది. ఈ ఉద్యమాలను తక్కువ అంచనా వేయడం ఏ రాజకీయ పార్టీకీ మంచిది కాదు. ఇవి కేవలం ఆందోళనలు కావు. ఇవి ఒక తరం మేల్కొంటున్న సంకేతాలు. దీన్ని అర్థం చేసుకోకుండా అణచివేయాలని ప్రయత్నిస్తే, అందుకు రాజకీయ మూల్యం చాలా ఎక్కువనే చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే యువత అంటే ప్రజల్లో ఓ చిన్న గ్రూపు కాదు. యువతే దేశ భవిష్యత్తు. వీరి ప్రశ్నలకు చెప్పాల్సిన సమాధానం లాఠీతో కాదు. ప్రభుత్వాలకు ఇప్పుడు రెండు మార్గాలే ఉన్నాయి. ప్రశ్నించే విద్యార్థులను లాఠీలతో అణచివేయడం.. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం. రెండో మార్గం మాత్రం శాశ్వతమైన నమ్మకాన్ని నిర్మిస్తుంది.
ఢిల్లీ అయినా, జార్ఖండ్ అయినా, మరే రాష్ట్రం అయినా విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయడం పరిష్కారం కాదు. విద్యార్థుల డిమాండ్ న్యాయమైనదైతే పరిష్కరించాలి. పరీక్షల్లో, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరుగకుండా చూసుకోవాలి, జరిగితే బాధ్యులను శిక్షించాలి. పరీక్షల్లో పారదర్శకత తీసుకురావాలి. నియామక వ్యవస్థను ప్రక్షాళన చేయాలి.
ప్రభుత్వం జవాబుదారీగా నిలువాలి. అంతిమంగా, అధికారంలో ఉన్న ప్రతీ పార్టీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. విద్యార్థుల గొంతును నొక్కితే ప్రశ్న ఆగదు. ప్రశ్నకు సమాధానం ఇస్తేనే సమస్య పరిష్కారానికి మార్గం ఏర్పడుతుంది, ఉద్యమం ఆగుతుంది. ఈ రోజు జంతర్ మంతర్లో వినిపించిన స్వరం రేపు దేశవ్యాప్తంగా వినిపించవచ్చు. ఈ రోజు రాంచీ వీధుల్లో వినిపించిన నినాదం, రేపు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యువత గొంతులో ప్రతిధ్వనించవచ్చు. ఆ పరిణామాన్ని పాలకులు ప్రమాదంగా చూస్తారేమో. కానీ నినదించే గొంతులే ప్రజాస్వామ్యానికి కొత్త శ్వాసగా చూడగల పాలకులే చరిత్రలో నిలిచిపోతారు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
– వీరేంద్ర కాపర్తి