సుబేదారి, మార్చి 11 : షేర్ మార్కెట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న కిలాడీ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 50 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ల్యాప్‌టాప్‌లు, స్వైపింగ్ మిషన్, 8 సెల్ఫోన్లు, చెక్‌బుక్, క్రెడిట్‌కార్డులు, స్టాంప్‌లు, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిందితుల అరెస్టు వివరాలను సీపీ డాక్టర్ తరుణ్‌జోషి శుక్రవారం వెల్లడించారు. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం ప్రాంతానికి చెందిన శివాని, బిజ్జు మాధవన్ దంపతులు ఢిల్లీలో ఉంటూ జల్సా జీవితానికి అలవాటుపడ్డారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని ప్రజలకు ఆశ కల్పించారు. పీవీఆర్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వీరు బోగస్ సంస్థను ఏర్పాటు చేసి, హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో మధ్యవర్తులను నియమించుకున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే 4 నుంచి 8శాతం కమీషన్ వస్తుందని పలువురిని నమ్మిచారు. డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో వేసిన వెంటనే డ్రా చేసేవారు. కొద్ది రోజుల క్రితం నిందితులు కన్సల్టెన్సీ సంస్థను మూసివేసి, ఫోన్లలో అందుబాటులో లేకుండా పోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి ఢిల్లీలో ఉన్న కిలాడీ దంపతులను పట్టుకున్నారు. మరో నిందితుడు గోగుల శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఏసీపీ నందిరాం నాయక్, సైబర్ క్రైం సీఐ జనార్దన్‌రెడ్డి, సుబేదారి సీఐ రాఘవేందర్, సిబ్బందిని సీపీ తరుణ్‌జోషి అభినందించారు.