నమస్తే నెట్వర్క్, ఫిబ్రవరి 15: మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడా యి. ఆదివారం ఉదయాన్నే ఆలయాల కు చేరుకున్న భక్తులు ‘శివోహం.. హరోహం’ అంటూ ముక్కంటిని భక్తిశ్రద్ధలతో పూజించి జాగరణ చేశారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సాం స్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వేములవాడ రాజన్న అనుబంధ భీమేశ్వరాలయానికి లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భీమేశ్వరస్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. రాత్రి 11:30 గంటలకు లింగోద్భవకాలంలో ఆలయ ఇన్చార్జి స్థానాచార్యులు ఎన్ ఉమేశ్ ఆధ్వర్యంలో 11 మంది రుత్వికులతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.
శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని మల్లికార్జునస్వామి, అమ్మవార్లను దర్శించుకొన్నా రు. ప్రభోత్సవం సందర్భంగా కళారూపాలు ప్రదర్శించారు. లింగోద్భకాల మహారుద్రాభిషేకం, రాత్రి 12 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం కనుల పం డువగా నిర్వహించారు. హనుమకొండలోని వేయిస్తంభాలగుడి, మడికొండలో ని మెట్టుగుట్ట, ఐనవోలు మల్లికార్జునస్వామి, వరంగల్ కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, కోటిలింగాలు, ఖిలావరంగల్‌లోని రామలింగేశ్వరాలయం, శివనామస్మరణతో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల గుట్టలు మార్మోగాయి.