మహబూబాబాద్ : మోసకారి కాంగ్రెస్ సర్కారుపై ప్రజాతిరుగుబాటు మొదలైంది. గ్యారెంటీల గారడీపై
జనగర్జన షురూ అయిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కురవి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్త డ్రామాకు తెరలేపి, హామీలు ఎలాగైతే ఎగ్గొట్టారో ఇపుడు బీసీ రిజర్వేషన్లను కాలయాపన చేసి ఎగ్గొట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు ఒకసారి జీవో అని, మరోసారి బిల్లు అని, ఆర్డినెన్స్ అని కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నారు.
బీసీలు బాగుపడడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు కావొచ్చన్నారు. కాలయాపన చేస్తే సహించమన్నారు. గురుకుల పాఠశాల పిల్లలు చదువులో, క్రీడల్లో గొప్ప ప్రతిభను కలిగి ఉన్నారు. కానీ వారికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కావాల్సినంత సహకారం అందడం లేదన్నారు. డోర్నకల్ బిడ్డగా అడుగుతున్న. ఈ ప్రాంత గిరిజన బిడ్డగా ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు గిరిజన సమాజానికి నేను చేసిన అభివృద్ధి పనుల వివరాలు ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత డోర్నకల్కి, గిరిజన సమాజానికి మీరు చేసిన పనులు ఏంటో చెప్పగలరా? అని నిలదీశారు.