కురవి, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబీఐకి అప్పగించడాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతి కవిత ఆధ్వర్యంలో సోమవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని 365 జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల పక్షాన ప్రభుత్వం వైఫల్యాలను నిలదీశారు.
ఈ సమయంలో మెడికల్ కళాశాల భవన ప్రారంభోత్సవానికి వెళ్తున్న మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచందర్ నాయక్ కాన్వాయిలకు కార్యకర్తల ఆందోళనతో అంతరాయం కలిగింది. మంత్రుల వాహనాలు ఆందోళన స్థలానికి చేరుకునేలోపే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
రేవంత్ రెడ్డి సైకోలా ప్రవర్తిస్తున్నాడు
అనంతరం సత్యవతి రాథోడ్, మాలోతి కవితలు ఎస్సారెస్పీ కాలువ వద్దకు చేరుకుని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఎస్సారెస్పీ కాలువలు అధ్వానంగా తయారయ్యాయని, నీటి పారుదల సదుపాయాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ రైతులను కన్నబిడ్డలాగా చూసుకున్నారని, కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైకోలా ప్రవర్తిస్తున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
ఎల్ఎండ్టీ సంస్థ కేవలం 300 కోట్ల రూపాయలతో కాళేశ్వరం రిపేరు చేయగలమని చెప్పినా, రైతులను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబడుతోందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 500 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల భవనాన్ని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రారంభించడానికి రావడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
సిబిఐ విచారణ వెనక్కి తీసుకోవాలి
రైతులు వారం రోజులుగా యూరియా కోసం క్యూలలో నిలబడినా ఒక్క బస్తా కూడా అందడం లేదని, ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిబిఐ విచారణను వెనక్కి తీసుకోవాలని, రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పని చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలోని నాగుమయ్య దేవస్థాన ఆవరణలో యూరియా పంపిణీ కోసం వ్యవసాయ అధికారులు టోకెన్ ఇస్తున్న ప్రదేశాన్ని వారు సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తోటలాలయ్య, బజ్జురి పిచ్చిరెడ్డి, గుగులోతు రవి, రాజు నాయక్, నూతక్కి నరసింహారావు, దొడ్డ గోవర్ధన్ రెడ్డి, నరహరి, ముత్యం వెంకన్న, బోడ శ్రీను బాదె నాగయ్య, సంగెం భరత్, వినోద్, శ్రీను, చంద్రారెడ్డి, గుగులోతు నెహ్రూ కృష్ణమూర్తి, దొంగలి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.