మహబూబాబాద్ రూరల్, జనవరి 25 : కాంగ్రె స్ పార్టీవి మోసపూరిత వాగ్దానాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్‌లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై ఉద్దేశపూరితంగా కేసులు పెడుతున్నారన్నారు. ఎప్పుడో సమసి పోయిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కావాలనే కక్షకట్టి హరీశ్‌రావు, కేటీఆర్‌ను విచారణకు పిలిచారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిరుపేదలకు అండగా ఉండి ఉద్యమిస్తామన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో రూ. 50 కోట్లతో మానుకోట పట్టణాన్ని అభివృద్ధి చేశామని, గతంలో ప్రారంభించిన పనులకే మళ్లీ కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించా రు. పట్టణంలో గతంలో గిరిజనుల భవనాన్ని నిర్మించామని, మళ్లీ అనంతారం శివారులో బంజార భవనం పేరిట కాంగ్రెస్ మంత్రులు శంకుస్థాపన చేశారన్నారు.
అప్పుడు బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని పగులగొట్టారని మండిపడ్డారు. ప్రతిసారి మంత్రులు హెలికాప్టర్లో వచ్చి శంకుస్థాపనలు చేస్తున్నారే తప్ప పనులు మాత్రం జరగడం లేదన్నారు. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం కోసమే శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని సత్యవతి అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, ఎల్ది మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.