నర్సింహులపేట, ఆగస్టు 21 : సీఎం రేవంత్‌రెడ్డిది చేతగాని పాలన. అందువల్లే రాష్ట్రంలో యూరియా కొరత వచ్చింది. ఆయనకు వ్యవసాయం మీద కనీస అవగాహన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క రైతు ప్రశాంతంగా లేడు. నాట్లు పూర్తి చేసుకున్న రైతులకు ఇప్పుడు యూరియా అవసరం ఉందని అవగాహన, సోయి లేని ముఖ్యమంత్రి మనకు ఉండడం దురదృష్టకరం. రైతులు కడుపు మాడ్చుకొని రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. గత పదేళ్లలో కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం లాంటిదని చెప్పకోవచ్చు.
చినుకు పడగానే రైతుబంధు అందించి విత్తనాలు, ఎరువులు అందు బాటులో ఉంచిన ఘనత కేసీఆర్‌ది. పదేళ్లలో యూరియా, దుక్కిమందు కోసం రైతులు రోడ్డెక్కిన దాఖలాలు ఎక్కడా లేవు. ఢిల్లీకి కప్పాలు కట్టే శ్రద్ధ రైతుల మీద పెట్టి ఉంటే ఈ ఇబ్బందులు ఉండేవి కావు. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీలు హైదరాబాద్‌కే పరిమితయయ్యారు తప్ప ఇక్కడి ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి యూరియా కొరత లేకుండా చూడాలి.