మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 25 : తెలంగాణ సమాజం మొత్తం బాధతో, ఆవేదనతో తలదించుకునే దుర్మార్గమైన ఘటన కుమ్మెరలో జరిగిందని, బాధితులకు న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా పోరాడుతామని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో బుధవారం జరిగిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మధ్యా హ్నం ధర్నా శిబిరం వరకు చేరుకొని బాధితులు మౌనిక, గణేశ్, చంద్రకళను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాధితులకు జరిగిన అన్యాయాన్ని పట్టించుకోని ప్రభుత్వంపై, కేసును నీరుగార్చాలని చూసిన పోలీసులపై కేటీఆర్ మండిపడ్డారు. చంద్రకళ కుటుంబానికి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సాక్షిగా 2 నెలల పసిపాపను కోల్పోయి.. న్యాయం కోసం ఓ తల్లి పోరాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాలకు అతీతంగా దోషులు ఎవరైనా.. ఏ పార్టీ వారైనా సరే.. వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మేము రాజకీయాలు చేయడానికి రాలేదు.. హంతకులు ఏ పార్టీ వారైనా వదిలి పెట్టేదిలేదని.. న్యాయం జరిగే వరకూ ఆగేది లేదన్నారు. ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి ఈ ఘటన సిగ్గుచేటు అన్నారు. పసిపాప మృతి కారకులైన నిందితులకు అండగా నిలబడిన ప్రతిఒక్కరూ ముమ్మాటికీ దోషియే అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి అయినా, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా ఆ పసిపాప ప్రాణాలు తీసిన నిందితులకు అండగా నిలబడటం తప్పేనని స్పష్టం చేశారు. దాడి చేసిన 8 మందిపైన హత్యానేరం కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని, నిందితులు ఎవరైనా వారిని జైల్లో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అవసరమైతే ఉరిశిక్ష వేయాలే కానీ.. బయటకు వదలవద్దన్నారు. బాధిత కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారాన్ని ప్రభుత్వం అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు.
కుమ్మెర ఘటన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ ప్రకటించారు. తక్షణ సాయాన్ని అందించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆదుకున్నాడు. ఇదిలా ఉండగా కుమ్మెర గ్రామంలో బాధితులకు సొంతిల్లు లేకపోవడంతో పార్టీ తరఫున కట్టిస్తామని.. నిర్మాణం పూర్తయ్యాక ప్రారంభోత్సవానికి తానే వస్తానని కేటీఆర్ బాధితులకు భరోసా ఇచ్చారు.
అయితే బాధితులు మాత్రం ముందుగా మా పసిపాప మరణానికి కారణమైన వారికి శిక్ష వేయించారని కేటీఆర్‌ను కోరడంతో ఆయన చలించిపోయారు. బాధితులను చూస్తుంటే న్యాయం కోసం ఎంత తపిస్తున్నారో అర్థమవుతుందన్నారు. పోలీస్ యంత్రాంగం పక్షపాత ధోరణిని విడనాడాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే మర్రి అండగా ఉంటారని ఆయన భరోసానిచ్చారు. మొదటగా బాధితుల సమస్యను తెలుసుకొని అండగా నిలిచిన విశారదన్ మహరాజ్, బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీ నాయకులు, రజక, ప్రజా, బహుజన, బీసీ సంఘాల నాయకులను కేటీఆర్ అభినందించారు.
నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, నన్నపనేని నరేందర్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బాసు హనుమంతు నాయుడు, శ్రీనివాస్‌రెడ్డి, ఇంతియాజ్ ఇసాక్, కురువ విజయ్‌కుమార్, రాజారాం యాదవ్, చిలకమర్రి నర్సింహ, బత్తుల రాజు, నరేందర్, బైకాని శ్రీనివాస్ యాదవ్, సోషల్ మీడియా ఇన్చార్జి గౌస్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరాచకాలు పెరిగిపోయాయని, ముఖ్యంగా సీఎం సొంత జిల్లా పాలమూరులో కాంగ్రెస్ దౌర్జన్యాలు పెట్రేగిపోయాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కుమ్మెరలో బీసీలపై దాడికి పాల్పడి పసిపాప మృతికి కాంగ్రెస్ వారే కారకులయ్యారని విమర్శించారు. పట్టపగలు.. వేలాది భక్తులు చూస్తుండగానే గణేశ్‌ను గదిలో బంధించి.. పసికందును ఒళ్లో పెట్టుకొని అడ్డుకోబోయిన మౌనికపై దాడి చేయడం హేయనీయమన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పట్టించుకోకుండా దాడి చేసిన వారితోనే కౌంటర్ ఫిర్యాదు తీసుకొని ఉల్టా కేసు నమోదు చేశారని మండిపడ్డారు. కేసు పెట్టినరోజు పట్టించుకోని పోలీసులు ఈరోజు నిరసనలు, ఆందోళనలు చేసేసరికి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

రెండురోజుల కిందట డీజీపీని కలిశామని, నిందితులు ఏపార్టీ వారైనా.. ఎంతటి వారైనా వదిలి పెట్టవద్దని, అట్రాసిటి కేసులో అరెస్టు చేసి శిక్షించాలని కోరినట్లు తెలిపారు. కేసులు పెట్టవద్దని పోలీసులకు వచ్చిన ఫోన్లను బహిర్గతం చేస్తామని, వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
దాడి సమయంలో అక్కడున్న సీసీ కెమెరాలు తెల్లారేసరికి ఎందుకు తొలగించారని, తప్పుచేయకపోతే కెమెరాలు ఏమయ్యాయని, బాధితులు పీఎస్‌కు వచ్చిన సీసీ ఫుటేజీలు ఎందుకు మాయమయ్యాయని ప్రశ్నించారు. కేసులు పెట్టకుండా ప్రయత్నించిన పోలీసులను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వీడకుంటే జాతీయ, అంతర్జాతీయ సమస్యగా నిలుస్తుందన్నారు. పాలమూరు జిల్లా వాసి సీఎం అయ్యాడు.. పాలమూరును పూర్తి చేసి రైతులను ఆదుకుంటాడనుకుంటే.. ప్రజలు ప్రశాంతంగా బతకకుండా అరాచకాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ అండ చూసుకొని పోలీసులు ఇసుక దందాలు చేస్తూ పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు తేస్తున్నారని విమర్శించారు.
నాగర్‌కర్నూల్‌లో ఇలాంటి ఘటన జరగడం అమానుషత్వమని, మ హేంద్రనాథ్ ఆధ్వర్యంలో కులాలకు, మతాలకు అతీతంగా ఉద్యమం జరిగిన గొప్ప నేల నాగర్‌కర్నూల్ అని, అలాంటి ప్రాంతంలో రజక కుటుంబంపై జరిగిన దాడి, చిన్నారి మృతి దారుణమైన ఘటన అని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. పార్టీలకు అతీతంగా బాధిత కుటుంబానికి న్యాయంకోసం చేస్తున్న పోరాటం గొప్పదని, కేటీఆర్ వచ్చిన తర్వాత పోరాటం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని, బడుగు, బలహీన వర్గాలు, బీసీలకు న్యాయం చేసేందుకు చేస్తున్న పోరాటం మంచి పరిణామమన్నారు.

ఉద్యమ సమయంలో ఉద్యమ నేతలను పుట్టిన నేల కందనూలులో ఇలాంటి ఘటనలు జరగడం దారుణ మంటూ ‘చాయి తాగితే గ్లాసులు మైలవడి పోతాయంటా.. మనము మొక్కితే దేవుడు మహిమకోల్పోతాడంటా.. మనం గుడిలోకి అడుగు పెడితే గుడినే వెలివేస్తారంటా…గాలిని పీల్చి వదులుతున్నము గాలిని కూడా వదిలేస్తారా… వెలిగే పొద్దున తిరుగుతున్నం పొద్దును కూడా వద్దంటారా.. గాలికి గంగకు అంటని అంటు మేమంటుకుంటే ఎట్ల ఉంటదంటూ… పాట పాడుతూ దైవ దర్శనానికి వెళ్లిన చంద్రకళ కుటుంబాన్ని వెలివేసిన తీరును గోరటి పాట రూపంలో కళ్లకు కట్టినట్లుగా వివరించారు.
అకారణంగా దాడి చేసిన కుటుంబానికి న్యాయం చేయాలని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి స్థిరం కాదు, కానీ ప్రజలు వేదనను, ప్రజల దుఃఖాన్ని, ప్రజల ఆవేదనను పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు ఉంటే ప్రజల నుంచి మౌనమైన హెచ్చరిక వస్తుందని, దానిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటన తెలుగు రాష్ర్టాలతోపాటు అంతర్జాతీయంగా మారుమోగుతుందని, న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టవద్దన్నారు. బీసీ కులానికి జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు, న్యా యం కోసం అన్ని రంగాలు, ప్ర జా సంఘాల నాయకులు చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు.