– అధికారుల సహకారం లేకుండా గ్రామాభివృద్ధి ఎలా?
– గుంతల్లో తట్టెడు మట్టి పోయాలన్నా అడ్డంకులే
చుంచుపల్లి, ఆగస్టు 07 : గ్రామంలో చిన్న గుంతకు తట్టెడు మట్టి పోయాలన్నా అధికారులు సహకరించడం లేదు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. అధికారులు అడ్డుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీని ఎలా అభివృద్ధి చేయాలని రుద్రంపూర్ సర్పంచ్ బానోత్ కేస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రుద్రంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అంశంపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ పంచాయతీరాజ్ ఏఈ, డీఈలు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అభివృద్ధి కావాలని కోరుతున్నారని, అయితే అధికారుల సహకారం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. విద్యుత్ సిబ్బంది కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. రుద్రంపూర్ సింగరేణి ప్రభావిత ప్రాంతం కావడంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులపై అప్పటి సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజును కలిసి వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఆయన స్పందించి సివిల్ అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదన్నారు.
గ్రామంలో గుడుంబా, బెల్ట్‌షాపుల కారణంగా పలువురు మద్యానికి బానిసలై కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సర్పంచ్ తెలిపారు. రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో గుడుంబా, బెల్ట్‌షాపులు లేకుండా చేయడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ తోట రాజు మాట్లాడుతూ.. అధికారులు తమ తీరు మార్చుకోకపోతే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. సింగరేణి కాలనీల్లో సంవత్సరాల క్రితం నిర్మించిన రోడ్లు పూర్తిగా ధ్వంసమై గుంతలు ఏర్పడ్డాయని, వర్షాకాలంలో ఆ గుంతల్లో నీరు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్, వీఆర్వో గోపాల్, వైద్యులు జ్యోతి, మహేందర్, వార్డు సభ్యులు సలిగంటి నవీన్, మొహమ్మద్ ఫయాజ్, గంట స్వరూప, పొన్నగంటి రాజ్యలక్ష్మి, ఆరిఫా, ఆరెల్లి శ్రీనివాస్, ధనసరి నాగమణి, శ్రీరాముల త్రివేణి, ధనసరి సాయి చరణ్, ఇరుప శ్రీనివాసు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ కేస్లీ, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.