ఎల్కతుర్తి, ఏప్రిల్ 16 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ కోసం దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ ఏం మాట్లాడతారనే ఉత్కంఠ ప్రజల్లో ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, వాసుదేవరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్రెడ్డిలతో కలిసి సభా స్థలిని పరిశీలించారు. ప్రధాన వేదిక వద్ద చేస్తున్న పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానీకానికి ఈ సభ ధైర్యాన్నిస్తుందన్నారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ సబ్బండ వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి పోరాడారని, చివరకు చావు నోట్లో తలపెట్టి నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించారన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన పదేండ్లలో బంగారు తెలంగాణగా మార్చారని కొనియాడారు. అన్ని కులాలు, వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తూ సమన్యాయం పాటించారన్నారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేక చతికిలపడిందని దుయ్యబట్టారు. మార్పు అంటే పేర్లు, విగ్రహాలు మార్చడం కాదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం మార్పా? అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అక్కడి ప్రజల్ని వంచించడం, మోసం చేయడం ఆ పార్టీకి అలవాటేనని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలంతా మళ్లీ కేసీఆరే రావాలని, సమయానికి అనేక పథకాలు అందించాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చి సభను జయప్రదం చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు సత్యవతి వెల్లడించారు. కార్యక్రమంలో వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, వెంకన్న, మండలాధ్యక్షుడు పిట్టల మహేందర్, సొసైటీ వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, మాజీ ఎంపీపీ మేకల స్వప్న, మాజీ జడ్పీటీసీ శ్రీపతి రమ, నాయకులు తంగెడ నగేశ్, కడారి రాజు, హింగె శివాజీ, రాజేశ్వర్‌రావు, దేవేందర్‌రావు, గుండేటి సతీశ్, దుగ్యాని సమ్మయ్య, కోరె రాజుకుమార్, పాటి భగవాన్, వేముల శ్రీనివాస్, కుర్ర సాంబమూర్తి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.