మహబూబాబాద్ రూరల్/గూడూరు, ఏప్రిల్10: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో మానుకోట సత్తా చాటాలని, వేలాదిగా స్వచ్ఛందంగా తరలిరావాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గురువారం మహబూబాబాద్, గూడూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌తో కలిసి సన్నాహక సమావేశాల్లో పాల్గొని సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం సత్యవతి మాట్లాడుతూ ఈనెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల సభను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని అన్నారు.
ముఖ్య నాయకులు, కార్యకర్తలు తమ ఇంట్లో పండుగలా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని, ఇప్పటికి ప్పుడు ఎన్నికలొస్తే బీఆర్ఎస్ పార్టీదే అధికారమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖతమైందని, ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కార్యకర్తలు, నాయకులు ప్రజలకు వివరించాలని, గ్రామాల్లో చర్చ జరగాలని అన్నారు. గత పదేళ్లలో మానుకోట నియోజకవర్గం శంకర్‌నాయక్ హయాంలో ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు చెబుతున్నారని, 15 నెలల్లో ఎంత అభివృద్ధి జరిగిందో మురళీనాయక్ చెప్పాలని అన్నారు.
పనులు చేయక పోవడం వల్ల గ్రామాల్లో ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేదన్నారు. గ్రామాలు, తండాల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు మహబూబాబాద్‌కు వారానికొకసారి వచ్చి అభివృద్ధి పనుల్లో పాల్గొన్నా మని, నేటి వరకు మహబూబాబాద్‌కు ఎంత మంది మంత్రులు వచ్చారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మానుకోటకు ఒక పేజీ ఉందని, అదేవిధంగా సభను కూడా విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో మహబూబాబా ద్ మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, మార్నేని వెంకన్న, యాళ్ల మురళీధర్‌రెడ్డి, తేళ్ల శ్రీను, లునావత్ అశోక్ నాయక్, కన్న, జీ వెంకన్న, రామచంద్రు, నవీన్నా యక్, ఖాదర్‌బాబా, సంతోష్, బీఆర్ఎస్ గూడూరు మండల అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం సంపత్‌రావు, మాజీ జడ్పీటీసీ ఎంబా ఖాసీం, బానోత్ మోతీలాల్, మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, నాయకులు కఠార్‌సింగ్, కాల్సానీ వేణుమాధవరెడ్డి, బోడ కిషన్, చీదురు వెంకన్న, ఏదునూరి వెంకన్న, నర్సింహానాయక్, కోడి రవి, ఎలమందల రవీందర్, సుధాకర్, యాకయ్య, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. గత పదేళ్లుగా రైతులు, మహిళలు, గ్రామాల అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రస్తుతం రైతులు పంటలను అమ్ముకోవడానికి సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఒక్క సామాజిక వర్గం కూడా రేవంత్‌రెడ్డి పాలనలో ఆనందంగా జీవించడం లేదు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ పార్టీని గద్దె దించి తిరిగి కేసీఆర్ పాలన తీసుకురావడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి.
– ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు
కార్యకర్తల వెన్నంటే ఉండి కంటికి రెప్పలా కాపాడుకొంటా. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు పదవులు అనుభవించి నేడు పార్టీని బద్నాం చేస్తున్నారు. వారి వక్ర బుద్ధి తెలిసిపోయింది. కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులకు పార్టీ గుర్తింపునిచ్చి ఆదుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజల సంక్షేమం కోసం పనిచేద్దామనే చిత్తశుద్ధి లేదు. ఏ గ్రామానికి పోయినా సీఎం రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి అమలు చేయలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలి.
-మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్