మహబూబాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : పన్నెండేండ్ల పాలనలో బీజేపీ సర్కార్ గిరిజనుల అభివృద్ధిని విస్మరించిందని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ అన్నారు. వరంగల్లో జరిగిన సభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్య లు అర్ధరహితమని, వాటిని ఖండిస్తున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుష్కర కాలంలో లంబాడా, ఆదివాసీలకు చేసింది శూన్యమని, గిరిజనుల వెనుకబాటుకు కాంగ్రెస్, బీజేపీలే కారణమన్నారు.
1956లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ అంశాన్ని నిర్లక్ష్యం చేసిందని, అనంతరం జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి 1976లో రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. స్థానిక గిరిజనులకు ఉద్యోగాలు కల్పించేందుకు జారీ చేసిన జీవో నంబర్ 272ను కొందరు కోర్టులో సవాలు చేయడంతో 2022లో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అది రద్దయ్యిందన్నారు. దీంతో గిరిజనుల ఉద్యోగాలు, విద్యావకాశాలు, పదోన్నతులకు నష్టం జరిగిందని, బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందన్నారు.
ఎన్టీఆర్ హ యాంలో ఐటీడీఏలకు నిధులు కేటాయించి గిరిజన అభివృద్ధికి పెద్దపీట వే శారని, అనంతరం స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సంక్షేమం కోసం తీవ్రంగా శ్రమించారన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చే సి, 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు సేవాలాల్ మహారాజ్ జ యంతికి గుర్తింపునిచ్చారన్నారు. రూ. 50 కోట్లతో హైదారాబాద్లో లంబాడా, ఆదివాసీ భవన్లు నిర్మించి దేశ వ్యాప్తంగా గిరిజన ఖ్యాతిని పెం చారన్నారు.
కల్లబొల్లి కబుర్లు, మాయ మాటలతో గిరిజనులను మోసం చే యాలని చూస్తే ఊరుకోబోమన్నారు. ఇక్కడి గిరిజనుల ఓట్లతో గెలిచిన ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు రాంచంద్రునాయక్, మురళీ నాయక్ సమస్యలను గాలికి వదిలేసి ఎక్కడో తిరుగుతున్నారని, రానున్న రోజుల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కృషి చేయాలని, రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని సత్యవతి డిమాండ్ చేశారు.