కురవి, ఫిబ్రవరి 8 : అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మేమున్నామని భరోసా ఇవ్వడంతో పాటు అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ పోరాడుతుందని ఎమ్మెల్సీ, శాసనమండలిలో బీఆర్ఎస్ విప్ సత్యవతిరాథోడ్ స్పష్టం చేశారు. అక్కడ విద్యార్థుల పడుతున్న గోసను శనివారం జూమ్ మీటింగ్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో కలిసి ఆమె పాల్గొని వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. విద్యార్థులూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటామని చెప్పారు. అనంతరం కురవి మండలం అయ్యగారిపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వం విదేశీ విద్యనభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అంబేద్కర్ స్కాలర్షిప్ను రూ.5లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచిందని గుర్తుచేశారు. అలాగే రూ.20లక్షల సాలర్ షిప్ను అందించిందని తెలిపారు. 127 మంది ఎస్టీ విద్యార్థులకు తొలి విడత రూ.10లక్షలు చెల్లించామని, రెండో దఫా చెల్లించే సమయానికి ఎన్నికలు వచ్చాయని ప్రస్తుతం ఆ విద్యార్థులు సాలర్షిప్ అందక అమెరికాలో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ విద్యకు రూ.25 లక్షలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కనీసం రెండో దఫా నిధులు చెల్లించలేదన్నారు.
ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కమిటీ కూడా వేయలేదన్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ల గురించి బడ్జెట్లో పెట్టకపోవడం విచారకరమన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక అక్కడ చదివే మన విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా మారిందని, పార్ట్ టైం ఉద్యోగాలు చేసే అవకాశం కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సాలర్షిప్ రాక ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎస్టీ, ఎస్సీ ఎమ్మెల్యేలను కూడగట్టి అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. విద్యార్థులు భయపడొద్దని ధైర్యం చెప్పారు. సమావేశంలో జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్పర్సన్ బజ్జూరి ఉమ, గ్రామ మాజీ సర్పంచ్ బజ్జూరి జోత్స్న, పార్టీ మండల అధ్యక్షుడు తోట లాలయ్య తదితరులు పాల్గొన్నారు.