కాంగ్రెస్ రెండు ముఖాలు, రెండు నాలుకల ధోరణి ప్రపంచానికి మరోసారి వెల్లడయ్యింది. లోక్‌సభ స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ నాయకత్వంలోని విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన రోజే తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ బీఆర్ఎస్లోనే ఉన్నారని తీర్పు చెప్పారు. వారు పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవని చెప్పుకొచ్చారు. దీంతో పార్టీ ఫిరాయించిన మొత్తం పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరిశుద్ధులైపోయారన్నమాట. ఈ తతంగం రాహుల్‌కు తెలియకుండా జరిగిందంటే కాంగ్రెస్ వాళ్లే నమ్మరు. రాజ్యాంగ గ్రంథాన్ని చేతులో పట్టుకొని పర్యటనలు చేస్తున్న రాహుల్.. తన తండ్రి రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన చట్టానికి తూట్లు పొడవడం విషాదం.
సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు. స్పీకర్‌ను కుర్చీ నుంచి దించే బలం తమకు లేదని, ఆ తీర్మానం వీగిపోతుందని కాంగ్రెస్ నేతలతోపాటు అందరికీ ముందుగానే తెలుసు. అయినా కూడా తీర్మానం ప్రవేశపెట్టారు. ఆనాడు ఫిరాయింపుల చట్టం తెచ్చినప్పుడు రాజీవ్‌గాంధీ పేర్కొన్న కారణాలు, అభ్యంతరాలను ఇప్పుడు తీర్మానం పెట్టడానికి కారణాలుగా కాంగ్రెస్ నేతలు పరిగణనలోకి తీసుకున్నారు. అయితే అవే కారణాలు, అభ్యంతరాలు తెలంగాణ అసెంబ్లీలోనూ రెండేండ్లుగా ఉన్నాయి. తెలంగాణలో జరుగుతున్న ప్రజాస్వామ్య హననాన్ని కండ్లారా చూస్తున్న రాహుల్.. అక్కడ లోక్‌సభలో ప్రజాస్వామ్యం నశించిందంటూ గొంతు చించుకోవడం హాస్యాస్పదం. రాహుల్ ద్వంద్వ వైఖరి చూసి దేశ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని, విపక్ష సభ్యులైన తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని, 8 మంది ఎంపీలను అక్రమంగా సస్పెండ్ చేశారని, విపక్ష మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ప్రధానులను అధికారపక్షం విమర్శిస్తున్నా.. స్పీకర్ నియంత్రించలేకపోయారని కాంగ్రెస్ నాయకత్వంలోని 118 మంది లోక్‌సభ సభ్యులు ఫిబ్రవరి 10న అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చారు. మార్చి 11న సభలో సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత మూజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయింది.
విశేషమేమిటంటే తెలంగాణలోని కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభా నాయకుడుగా ఉన్న అసెంబ్లీలో కూడా అవే సందర్భాలు, ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడే అవకాశం లేకుండా మైక్ కట్ చేస్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు, కేటీఆర్ పలుమార్లు సభలో ప్రస్తావించారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న శాసనసభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. బీఆర్ఎస్కు చెందిన మహిళా శాసన సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని సభా నాయకుడే అవమానించారు. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?’ అన్నట్టుగా సభా నాయకుడి అడుగుజాడల్లోనే అధికారపక్ష సభ్యులు కూడా నిండు సభలో బూతులు మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు.
మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీని లోక్‌సభ వేదికగా విమర్శిస్తుంటే తట్టుకోలేని రాహుల్, ఇక్కడ అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ నేతలు అమానుషమైన పదాలతో దుర్భాషలాడుతుంటే మాత్రం ఏనాడూ కల్పించుకోలేదు. సొంత పార్టీ పాలిస్తున్న రాష్ట్రంలో స్పీకర్ సమక్షంలోనే అప్రజాస్వామిక ఘటనలు వరుసగా జరుగుతుంటే గుర్తించకుండా, సవరించకుండా లోక్‌సభలో మాత్రం తమకు అన్యాయం జరిగిందని హడావుడి చేయడం కాంగ్రెస్ రెండు ముఖాల ధోరణికి అద్దం పడుతున్నది.
అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు ఫిరాయించిన పదిమంది శాసనసభ్యులకు క్లీన్ చిట్ ఇవ్వడం వెనుక రాహుల్ ఆలోచన ఉన్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ప్రకటన నిజమే అనిపిస్తున్నది. పార్టీ ముఖ్యమంత్రి, పార్టీ పరిశీలకులతో కాంగ్రెస్ కండువాలు కప్పించుకోవడం, కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో బహిరంగంగా పాల్గొని అసెంబ్లీలో సైతం అధికారపక్షానికి కేటాయించిన సీట్లలో కూర్చోవడం, లోక్‌సభ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బహిరంగంగా ప్రచారం చేయడం కూడా పార్టీ ఫిరాయించారని అనడానికి ఆధారాలు కాకపోవడం చట్టసభల్లో పతనమవుతున్న విలువలకు తార్కాణం. బీఆర్ఎస్ తరఫున గెలిచిన శాసనసభ్యుడు తన పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ టికెట్‌పై లోక్‌సభకు పోటీ చేయడం కూడా ఫిరాయింపునకు సరైన ఆధారం కాదంటే అంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా?
వెంట్రుకలు, గోర్లను ఆధారాలుగా చేసుకుని పోలీసులు నేరస్థులను గుర్తిస్తున్న ఈ రోజుల్లో పార్టీ బీఫామ్, నామినేషన్, అఫిడవిట్, ఎన్నికల కమిషన్ గుర్తు కేటాయింపు, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్ల నియామకం, బ్యాలెట్, కౌంటింగ్, రిజల్ట్ ప్రసార, ప్రచార మాధ్యమాలు, ఓటర్లు ఇవన్నీ ఉత్తవేనా? ఆధారాలు కావా? ఇదెక్కడి న్యాయం? సొంత పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రంలో ఇంత ఘోరం జరుగుతున్నా జ్ఞానేంద్రియాలు మూసుకున్న రాహుల్ గాంధీ.. లోక్‌సభలో చేసే హడావుడికి విశ్వసనీయత ఏముంటుంది? ఈ ఫిరాయింపులపై స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసి, విన్నపాలు చేసి విసిగిపోయి, అలవికాని కాలయాపనతో సహించలేక న్యాయస్థానం తలుపు తట్టడంతోనైనా ఇన్నాళ్లకు తీర్పు వెలువడింది. లేకుంటే పుణ్యకాలం గడిచిపోయేదే.
శాసనసభా పక్షం చట్టబద్ధమైన చీలిక, విలీనం వేరు. ఫిరాయింపులు వేరు. కానీ ఈ రెండింటిని ఒకే గాటన కట్టి మీరు చేయలేదా? అని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై అర్థరహితంగా ఎదురుదాడికి దిగుతున్నారు. 2004లో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ప్రజలు ఉద్యమస్ఫూర్తితో గెలిపించిన 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో పదిమందిని తమ వైపు తిప్పుకొన్న కాంగ్రెస్ చరిత్ర నేటి నేతలకు తెలియదా? ఆ మాటకొస్తే ఫిరాయింపుల పితామహులు కాంగ్రెస్ నేతలు కాదా? బ్రిటిష్ ఇండియా చట్టం-1935 ప్రకారం 1937లో జరిగిన ఆరు రాష్ర్టాల ఎన్నికల్లో అధికారం కోసం ముస్లింలీగ్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది కాదా?
90 ఏండ్లుగా ఫిరాయింపుల తంతును కాంగ్రెస్ కొనసాగిస్తూనే ఉన్నది. 1978లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 60 మంది జనతా పార్టీ సభ్యుల్లో 56 మందిని కాంగ్రెస్ చేర్చుకోలేదా? 1967లో హరియాణాలో స్వతంత్ర ఎమ్మెల్యే గయా లాల్‌ను కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నది. ఆయన కాంగ్రెస్ నుంచి యునైటెడ్ ఫ్రంట్‌కు వెళ్లారు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి తిరిగి యునైటెడ్ ఫ్రంట్‌లో జాయిన్ అయ్యారు. ఇదంతా ఒక్క రోజులో, అదీ 9 గంటల్లో జరిగింది. అందుకే కదా ‘ఆయారాం గయా రాం’ అనే నానుడి స్థిరపడింది. ఈ చారిత్రక ఉదంతంలో కాంగ్రెస్ పాత్రను, ఘన చరిత్రను ఆ పార్టీ నేతలు కాదనగలరా?
స్పీకర్ పదవికి రాజ్యాంగం అసాధారణమైన అధికారాలను కట్టబెట్టింది. అందులో విచక్షణాధికారం ఒకటి. అది ఇలా వికటిస్తుందని రాజ్యాంగ నిర్మాతలు నాడు ఊహించి ఉండరు. స్పీకర్ నిర్ణయాల్లో పక్షపాతం చోటు చేసుకున్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని చాలా సందర్భాల్లో రుజువయింది. కొంతకాలం క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఏమీ జరగదు. ఉపఎన్నికలు రావు’ అని ధీమా వ్యక్తం చేసినప్పుడే ఫిరాయింపుల ప్రహసనం ఎలా ముగుస్తుందో అందరికీ అర్థమైంది. కానీ మినుకుమినుకుమన్న ఆశ ఇప్పుడు ఆవిరైపోయింది.
ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించిన సుప్రీంకోర్ట్ ఇప్పుడు ఫిరాయింపులపై ఏం చెప్తుందో అనే ఉత్కంఠ నెలకొన్నది. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి మకిలి అంటించే కుతంత్రాలను తిప్పికొడుతూ న్యాయస్థానాలు ఎన్నో తీర్పులను వెలువరించాయి. అవి చరిత్ర గతిని మార్చాయి. ఫిరాయింపులకు వక్రభాష్యాలు చెప్తున్న వైపరీత్యాలకు సుప్రీంకోర్ట్ ముగింపు పలుకుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.