దుండిగల్, జూన్ 2: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ కార్యాలయం ప్రాంగణంలోని అమరవీరుల స్తూపానికి తీవ్ర అవమానం జరిగింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున స్థూపాన్ని పూలతో అలంకరించి, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించాల్సిన సర్కిల్(మున్సిపల్), తహసీల్(రెవెన్యూ) అధికారులు మొక్కుబడిగా కార్యక్రమం పూర్తి చేయడం పట్ల తెలంగాణ వాదులు మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు నేరుగా సర్కిల్ కార్యాలయానికి వచ్చి.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అమరుల స్తూపాన్ని శుభ్రం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అమరుల త్యాగాలను విస్మరించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకునేందుకు సర్కిల్ డీసీ డా.వెంకటమణికరణ్కు పలుమార్లు ఫోన్‌చేయగా అయన స్పందించక పోవడంతో జిల్లా కలెక్టర్ మనుచౌదరికి ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలా జరుగకుండా చూడాలని కోరారు. అమరుల త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందనే విషయాన్ని అధికారులు విస్మరించొద్దన్నారు. అనంతరం సర్కిల్ కార్యాలయం వద్దకు అప్పటికే చేరుకున్న తెలంగాణ వాదులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ.. దుండిగల్ సర్కిల్ కార్యాలయంతో పాటు పక్కనే తహసీల్దార్ కార్యాలయం ఉన్నప్పటికీ అమరవీరుల స్థూపాన్ని పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు స్వరాష్ట్రంపై చిత్తశుద్ధి, ప్రేమ ఎంతమాత్రం లేదన్నారు. మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే సహించబోమన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు, తెలంగాణవాదులు పాల్గొన్నారు.