హనుమకొండ, డిసెంబర్ 21 : రెండేళ్ల అనంతరం ఎట్టకేలకు పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువు దీరనున్నాయి. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన పల్లెల్లో సోమవారం సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధికార యంత్రాంగం ఆయా గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. మండల ప్రత్యేక అధికారి కొత్త పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే కొత్త సారథులకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గ్రామాలు అభివృద్ధి పథంలో పయనించగా, గత రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో కుంటుబడిన పల్లె ప్ర‘గతి’ మారుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. బీఆర్ఎస్ హయాంలో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా వాటి రూపు రేఖలు మారిపోయాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయి. ఫలితంగా పలు గ్రామాలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు సైతం అందుకున్నాయి. పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచాయి. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,683 మంది సర్పంచ్‌లు, 14,788 మంది వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే కొత్త పాలక వర్గానికి రెండేళ్లుగా తిష్టవేసిన సమస్యలు సవాల్‌గా మారనున్నాయి.
2024 జనవరి నెలాఖరులో గత పాలక వర్గం గడువు పూర్తికావడంతో అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు నిలిచి పోయాయి. దీంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం, పచ్చదనం, జీపీ భవనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండేళ్లుగా 15వ ఫైనాన్స్ కమిషన్‌తో పాటు ఇతర అభివృద్ధి నిధులు నిలిచిపోవడంతో పల్లెలు కుదేలాయ్యాయి.
చిన్న చిన్న అభివృద్ధి పనులు కూడా చేపట్టలేని దుస్థితి నెలకొంది. పారిశుధ్యం అధ్వానంగా మారింది. చెత్త సేకరణ వాహనాల డీజిల్‌కు డబ్బులు లేక, సిబ్బందికి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతేకాక పల్లె ప్రగతి ద్వారా సాధించిన విజయాలు క్రమంగా కనుమరుగవుతున్నాయనే భావన ప్రజల్లో బలంగా నెలకొంది. అయితే పంచాయతీ కార్యదర్శులే బాధ్యతగా తమ సొంత డబ్బులతో పాటు అప్పులు చేసి మరీ అత్యవసర పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకాధికారుల పాలనలో అన్నీ తామై వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శులు తాజాగా కొత్త పాలక వర్గం బాధ్యతలు స్వీకరిస్తుండడంతో పెండింగ్ బిల్లులు చెల్లిస్తారా? లేదా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.