ఎల్కతుర్తి, డిసెంబర్ 5 : పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని గ్రామాల్లో కూలీలకు ఉపాధి దొరుకుతున్నది. అభ్యర్థులెవరైనా వారే ప్రచార కార్యకర్తలు. పొద్దునో గుర్తు.. సాయంత్రం మరో గుర్తుకు ప్రచారం చేస్తున్నారు. ఫలానా వ్యక్తినే గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎన్నికలైపోయే దాకా వారికి భలే గిరాకీ ఉన్నది.
మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఈ నెల 11న జరగనుండగా, గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. తమ బలాలను నిరూపించుకునేందుకు అభ్యర్థులు పోటీపడి మరీ ర్యాలీలు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయి తే అభ్యర్థి ఎవరైతే మాకేంటి అని ప్రచారం చేసే మహిళలు, పురుషులు పిలిస్తే ర్యాలీకి వెళ్తున్నారు. దీనికి మహిళలకు ఒక్కొక్కరికి డిమాండ్‌ను బట్టి రూ. 200 నుంచి 300 వరకు ఇస్తున్నారు. పురుషులకైతే డబ్బులతో పాటు సాయంత్రం దావత్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ప్రచారానికి రావాలని పిలిస్తే వెళ్లకపోతే బద నాం అయితామని, అందుకే పిలిచిన వారందరికీ వెళ్తున్నామని వారు చెప్తుండడం విశేషం. ఓటు ఎవరికి వేస్తారని అడిగితే మాత్రం అది మాత్రం చెప్పమని, మాకు ఇష్టం ఉన్న వాళ్లకి వేస్తామని చెబుతున్నారు. గ్రామాల్లో ప్రచార రథాల జోరు ఊపందుకుంది. అభ్యర్థులందరి మైక్‌లు, డీజేలు బాక్స్‌లు మోత మోగుతుండడంతో జనాల చెవులకు మాత్రం చిల్లులు పడుతున్నాయి. ఇంటింటికి డోర్ పోస్టర్లు అంటించడం మొదలు ప్రతి పనికి కూలీల అవసరం తప్పనిసరైంది.