ఉట్నూర్ రూరల్, ఫిబ్రవరి 27: అడవిని నమ్ముకొని బ తుకుతున్న గిరిజనుల అభివృద్ధి, సంక్షేమాన్ని చట్టాల పేరుతో అడ్డుకోవడం సరికాదని, వారి సమస్యలను మానవీయ కోణంలో చూడాలని అటవీ అధికారులకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ సూచించారు. శుక్రవారం ఉట్నూర్ మండలంలోని కుమ్మరి కుంటలో పర్యటించారు. అంతకు ముందు కొలాంగూడలోని కుమ్రం సూరు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పునాది స్థాయిలో నిలిచిపోయిన ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లను పరిశీలించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. అడవిలో పుట్టి..అడవిని నమ్ముకొని బతుకుతున్న తమకు ఇండ్లు, రోడ్లు, వ్యవసాయం, కరెంటు వంటి విషయాల్లో అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని కొ లాం గిరిజన నాయకులు ఆవేదన వ్యక్తం చేశా రు. అనంతరం జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ కొలాం గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా అధికారులకు సూచించారు.
ఆదివాసుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పథకాలు అమలు చేస్తున్నదన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఆదివాసీలు తమ పిల్లలను చదివించాలన్నారు. అనంతరం ఐటీడీఏ ఎదుట నిరాహార దీక్షలు చేస్తున్న కొలాం గిరిజనులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి దీక్ష విరమింప జేశారు. స్వయం ఉపాధిపై కొలాం గిరిజనులు దృష్టి పెట్టాలని, వస్తువులు మార్కెటింగ్ చేయించే బాధ్యత తనదేనని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీఎస్టీ కార్యదర్శి కళ్యాణ్ రెడ్డి, సంచాలకులు అశోక్ కుమార్, ఏఎస్పీ మౌనిక, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, విద్యుత్ శాఖ ఎస్సీ శేషారావు, ఎఫ్‌డీవో అరవింద్, ఎఫ్ఆర్వో అరుణ, ఈఈ తానాజీ, డీడీ అంబాజీ, సీఐ మడావి ప్రసాద్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో రాంప్రసాద్, రితీశ్ రాథోడ్, గుగ్లావత్ శ్రీరాం నాయక్, సట్ల అశోక్, ఆయా శాఖల అధికారులు, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.
గురుకుల కళాశాల సిబ్బందిపై ఆగ్రహం..
ఎదులాపురం, ఫిబ్రవరి 27 : జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించకపోవడం, వంటశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై సంబంధిత అధికారులను నిలదీశారు. ఆశ్రమ పాఠశాలల్లో వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు శ్యామలదేవి, రాజేశ్వర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, అటవీ శాఖాధికారి చిన్న విశ్వనాథ్ భూసరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నాగోబా ఆలయంలో పూజలు
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి27 : ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ నాగోబా ఆలయంలో ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యుడు జాటోత్ హూస్సేన్నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. నాగోబా ఆలయ అభివృద్ధి కోసం ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు వినతిపత్రం ఇచ్చారు. అంతకుముందు హర్కాపూర్ ఆంధ్గూడ, మచ్చాపూర్, కెస్లాపూర్ గ్రామాల్లో పర్యటించి గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు. మౌ లిక వసతులు, సంక్షేమ పథకాలు అందించాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
ఆశ్రమ పాఠశాల తనిఖీ
కడెం, ఫిబ్రవరి 27 : కడెంలోని ఎస్టీ బాలు ర ఆశ్రమ పాఠశాలను జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ తని ఖీ చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, డార్మెంటరీ రూమ్స్‌లో నూతన టైల్స్ వేసి, కిటికీలు సరిచేయాలని ఐటీడీఏ డీడీ అంబాజీకి సూచించారు.