‘నలుపు నారాయణుడు మెచ్చు’ అంటారు. కానీ, ప్రతి పదిమందిలో నలుగురు నలుపు రంగునే ఇష్టపడుతున్నారు. కృష్ణ వర్ణంలోని వస్తువులను కొనడానికే ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేసే బ్యాక్‌ప్యాక్స్, బ్రీఫ్ కేస్లలో 40 శాతం కన్నా ఎక్కువ బ్లాక్ కలర్లోనే ఉంటున్నాయట. ఇది ప్రయాణాలు, విమానాశ్రయాల చెకింగ్స్‌లో కొత్త సమస్యకు దారి తీస్తున్నదట. అందుకే, సెలవులను ప్లాన్ చేసుకునేవారు, కొత్త బ్రీఫ్‌కేస్ కొనాలని అనుకుంటున్నవారు.. ఒక్కసారి పునరాలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎందుకంటే, ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా… నలుపు రంగులోని బ్రీఫ్‌కేస్‌లు ఉండటం కామన్. ఎక్కడికైనా ప్రయాణాలు కట్టినప్పుడు అవన్నీ ఎయిర్‌పోర్ట్‌లో ఒకేచోట కలుసుకుంటాయి. దాంతో, తమ లగేజీ ఏదో గుర్తించడం ప్రయాణికులకు కష్టతరం అవుతున్నదట. బ్రీఫ్‌కేస్‌లు మారిపోయే అవకాశం కూడా ఉన్నదట. ముఖ్యంగా, ఎయిర్‌పోర్ట్‌లోని లగేజ్ క్యారౌసెల్పై ఉండే అనేక నల్ల బ్యాగులలో.. తమది కనిపెట్టడానికి ఎక్కువ సమయం పడుతున్నదట.
కొన్ని సందర్భాల్లో ఫ్లయిట్ మిస్సయ్యే అవకాశం కూడా ఉన్నది. అదే.. వేరే రంగువైతే సులభంగా గుర్తించొచ్చు. అందుకే, మీ లగేజీని ప్రత్యేకంగా చూపించడానికి విభిన్న రంగులు, విలక్షణమైన నమూనాలలో ఉండే బ్రీఫ్‌కేస్‌లను ఎంచుకోవాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఇక ఇప్పటికే నల్లని బ్యాగేజీ ఉన్నట్లయితే, వాటిని సులభంగా గుర్తించడానికి రంగురంగుల లగేజ్ ట్యాగ్లు, స్టిక్కర్లు అంటించుకోవాలని సలహా ఇస్తున్నారు.