హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెకుపై ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తిచేశారు. జస్టిస్ ఘోష్ కేసీఆర్‌ను సాక్షిగా పిలిచి అనంతరం దోషిగా నిర్ధారించారని తెలిపారు. ప్రభుత్వం సమర్పించిన రికార్డుల ఆధారంగా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం చెల్లదని స్పష్టంచేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి శైలేంద్రకుమార్‌జోషి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణను కొనసాగించింది.
ఈ సందర్భంగా కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా, అసెంబ్లీలో ఉంచకుండా, కేసీఆర్‌కు అందజేయకుండానే సీఎం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు వెల్లడించడం రాజకీయ దురుద్దేశంలో భాగమేనని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కమిషన్ నివేదిక మనుగడలో ఉంటే కేసీఆర్ వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌తో విచారణకు ఆదేశించడం వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలను తప్పులుగా చూపించాలనే ప్రస్తుత ప్రభుత్వ తలంపును తీవ్రంగా పరిగణించాలని కోరారు.
పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన 650 పేజీల నివేదిక చట్టవ్యతిరేకమని ప్రకటించాలని, ఆ నివేదికను రద్దు చేయాలని శేషాద్రినాయుడు కోరారు. సాక్షిగా విచారణకు పిలిచి వివరాలు కోరితే కేసీఆర్ కమిషన్‌కు నివేదించారని, అయితే కమిషన్ ఏకపక్షంగా కేసీఆర్‌పై చట్ట విరుద్ధంగా తుది నిర్ణయానికి వచ్చిందని తెలిపారు. కమిషన్ నిబంధనలను తుంగలోకి తొకిందన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్‌ను నియమించినప్పుడు విధివిధానాలను పేరొంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా విచారణ జరగలేదని చెప్పారు.
కమిషన్ ఏర్పాటైన అంశానికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా ఎవరైనా అందజేయవచ్చునని పబ్లిక్ నోటీసు జారీ చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు కూడా నోటీసు జారీ చేసిందని చెప్పారు. సాక్షిగా హాజరు కావాలని, వివరాలు, ఆధారాలు, రికార్డులు ఉంటే అందజేయాలని కోరిందని తెలిపారు. కానీ, ప్రాజెక్టు స్థలాన్ని మార్చాలన్న సలహాలను కేసీఆర్ పట్టించుకోలేదని, ప్రాజెక్ట్ డిజైన్, టెండర్ల ఖరారు, కాంట్రాక్టర్ల ఎంపిక వరకు అన్నింటికీ ఆయనే బాధ్యుడని నివేదిక ఇవ్వడం ఏకపక్షమని విన్నవించారు. ప్రభుత్వం సమర్పించిన రికార్డుల ఆధారంగా కమిషన్ తప్పుడు నిర్ణయానికి వచ్చిందని తెలిపారు.
కమిషన్‌కు శిక్ష విధించే అధికారం లేదని రామకృష్ణ దాల్మియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని కేసీఆర్ తరఫు న్యాయవాది గుర్తుచేశారు. వేర్వేరు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరారు. అభియోగాలు ఉండి ఉంటే పిటిషనర్లకు సాక్ష్యాలు, ఆధారాలు సమర్పించే అవకాశం ఇవ్వాలని అన్నారు. సాక్షిగా విచారణకు పిలిచిన కమిషన్ ఏకపక్షంగా దోషిగా నిలబెట్టాలనే కుట్ర దాని రిపోర్టును బట్టి స్పష్టమవుతున్నదని చెప్పారు.
కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్పి ఉంటే వాళ్ల సమక్షంలో కమిషన్ క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు అనుమతి ఇవ్వకుండా తుది నిర్ణయానికి రావడం సహజ న్యాయసూత్రాలకు, రాజ్యాంగం 21వ అధికరణం ద్వారా కల్పించిన హకుల రక్షణకు వ్యతిరేకమని తెలిపారు. కమిషన్ విచారణకు పిలిచిన చిట్టచివరి సాక్షి కేసీఆర్ అని, అప్పటికే ఆయనకు వ్యతిరేకంగా కమిషన్ వద్ద అభియోగాలు ఉంటే, ఆ విషయాలపై ప్రశ్నించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని సూచించారు.
ఘోష్ కమిషన్ నియామకం వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వ కీర్తిని కించపర్చాలన్న రాజకీయ కుట్ర ఉన్నదని శేషాద్రినాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ చేపట్టిన సర్వే నివేదికను అధ్యయనం చేశాక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌ల నిర్మాణాలతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలనేది కేసీఆర్ ప్రభుత్వ విధాన నిర్ణయమని తెలిపారు. ఇందుకు సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీల నుంచి అధికారిక అనుమతులు కూడా లభించాయని చెప్పారు. క్యాబినెట్ ఆమోదం లేకుండా పరిపాలనా అనుమతులు పొందారని కమిషన్ నివేదికలో పేరొనడం దారుణమని అన్నారు.
కాంట్రాక్టర్లకు అనుకూలంగా, అదనపు పనులకు మౌఖిక ఆదేశాలిచ్చారనే విషయంలో కూడా వాస్తవం లేదని చెప్పారు. వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలే అందుకు కారణమని కమిషన్ ఏకపక్షంగా తేల్చిందని తప్పుపట్టారు. కమిషన్ నిజనిర్ధారణ మాత్రమే చేయాలని, న్యాయవిచారణ చేయడానికి వీల్లేదని చెప్పారు. ఎవరు తప్పు చేశారో, ఎవరు ఒప్పు చేశారో తేల్చే అధికారం కమిషన్‌కు ఉండనే ఉండదని అన్నారు.
సాక్షిగా హాజరుకావాలని కమిషన్ కేసీఆర్‌కు నోటీసు ఇచ్చిందని, ఆ తర్వాత సాక్షిపైనే ఏకపక్షంగా నిందారోపణలతో నివేదిక ఇచ్చిందని న్యాయవాది తెలిపారు. సాక్షిపై అభియోగాలు మోపుతూ కమిషన్ నిర్ణయానికి రావడం చెల్లదని అన్నారు. కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్లో ఎకడా ఆర్థిక అంశాల ప్రస్తావన లేదని గుర్తుచేశారు. కమిషన్ నివేదికను 60 పేజీలకు సంక్షిప్తం చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ద్వారా కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేయాలనే తలంపు ఉన్నట్టు తెలుస్తున్నదని అన్నారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో ముందే పతాక శీర్షికలతో కథనాలు వచ్చాయని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా రూపొందించిన నివేదికను రద్దు చేయాలని లేదంటే పిటిషనర్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. దురుద్దేశపూరితంగా జరిగిన కమిషన్ విచారణ చెల్లదని చెప్పారు.
గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు విధానపరమైనవని చెప్పారు. రామనాథన్ అయ్యర్ నిఘంటువు ప్రకారం జ్యుడీషియల్ కమిషన్ నిజనిర్ధారణ నివేదికను మాత్రమే సమర్పించాలని గుర్తుచేశారు. ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్ తరఫున సీనియర్ న్యాయవాది జే రామచందర్‌రావు, మరో రిటైర్డు ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి తరఫున సీనియర్ న్యాయవాది తరుణ్ జీ రెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా పడింది.
కమిషన్ ప్రభుత్వానికి 650 పేజీల నివేదిక ఇస్తే దానిని ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ 60 పేజీలకు కుదించిందని, ఆ సంక్షిప్త నివేదికను సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బహిర్గతం చేశారని శేషాద్రినాయుడు తెలిపారు. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాక తదుపరి చర్యలు ఉండాలని, అందుకు విరుద్ధంగా కేసీఆర్ తప్పులు చేశారని తేల్చాలనే కుట్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని చెప్పారు. మీడియా ట్రయల్ కూడా జరిగిందని అన్నారు. ప్రజాజీవితంతో మమేకమైన కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతున్నదని తెలిపారు. ప్రభుత్వం రాజకీయంగా ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్టు, నిబంధనలకు వ్యతిరేకంగా కమిషన్ నివేదిక ఉన్నట్టు తీర్పు చెప్పాలని కోరారు. జీవో 6ను, కమిషన్ నివేదికను రద్దు చేస్తూ తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.