ఆదిలాబాద్, ఫిబ్రవరి 27 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పట్టించుకోని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన స్వలాభం కోసం జిల్లాకు అన్యాయం చేస్తున్నారని, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు, సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఏరియల్ సర్వే నిర్వహించడం వారి దొంగ నాటకం బయటపడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి ఒకే హెలీకాప్టర్‌లో వచ్చారని, ఇండస్ట్రీయల్ పార్కు కోసం గుట్టుచప్పుడు కాకుండా ఏరియల్ సర్వే నిర్వహించడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
వ్యాపారులను మోసం చేసిన ఎమ్మెల్యే భూ మాఫీయాను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని, సుదర్శన్ రెడ్డి, నరేందర్‌రెడ్డికి జిల్లాలో భూములు కొనుగోలు చేశారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని, ఎయిర్పోర్ట్ పేరిట ప్రజల భూములను కాజేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ హత్తీఘాట్లో బినామీల పేరిట కబ్జా చేశారని, ఈడీ ఆధీనంలో ఉన్న భూములను స్థానిక ఎమ్మెల్యే ప్రమేయంతో భూదాన్ ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌కు సైతం సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్, బీజేపీ నాయకులు సర్వేలు నిర్వహించారని అన్నారు. ఈ విషయంపై ఈడీతో పాటు ఉన్నతాధికారులను ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జోగు రామన్న వెంట యాసం నర్సింగరావు, మెట్టు ప్రహ్లాద్, దాసరి రమేశ్, పందిరి భూమన్న, అశోక్ స్వామి, నితిన్ రెడ్డి, తిరుపతి, బట్టు సతీశ్, వేణుకుమార్, తదితరులు ఉన్నారు.