వరంగల్, జనవరి 18 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ ఇసుక క్వారీలు అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నా యి. గిరిజన సహకార సంఘాలకు చెందాల్సిన ఇసుక రీచ్‌లను అధికారుల అండదండలతో అధికార పార్టీ నేతలు, అనధికార కాంట్రాక్టర్లు సొంతం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రీచ్‌లను దక్కించుకుంటున్న వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ప్రభుత్వ ఇసుక రవాణాలో ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు. మనుషులకు బ దులుగా భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ స్థానికులకు ఉపాధి లేకుండా ఇక్కడి ఇసుకను తరలిస్తున్నారు. గోదావరి నది పరీవాహక ప్రాంతమైన ములుగు జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో 50 ఇసుక రీచుల్లో 30 రీచ్‌లను ఇటీవలే కాంట్రాక్టర్లకు కేటాయించారు. వెంకటాపురం (నూగూరు) మండలం లో 27, మంగపేట మండలంలోని ఏడు ఇ సుక రీచ్‌లను సిండికేట్‌కు చెందిన బినామీ కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు.
గోదావరి నదికి అటూ ఇటూ ఉండే రాష్ట్ర ప్రభుత్వంలో కీలక ప్రజాప్రతినిధులు.. ముఖ్యనేత సన్నిహితుడు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుడి అనుచరులు కలిసి ఈ రీచ్‌లను నడుపుతున్నారు. ‘పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్’ (పెసా) నిబంధనల ప్రకారం ఈ ప్రాంతంలోని ఇసుక రీచ్‌లను గిరిజన సహకార సంఘాలకే కేటాయించాలి. ఇసుక రీచ్‌ల గుర్తింపు, కేటాయింపు అంతా పెసా నిబంధనలకు అనుగుణంగా జరగాలి. అధికార పార్టీ నేతలు, అధికారులు కలిసి ములుగు జిల్లాలోని ఇసుక రీచ్‌ల కేటాయింపుల్లో పెసాను పక్కనబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఓ సలహాదారు బంధువు ములుగు జిల్లాలో మైనింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. సిండికేట్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడ కేటాయించిన ఇసుక రీచ్‌ల నుంచి అధికార పార్టీ నేతలు భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
దోపిడీలో భాగస్వామ్యం..
ఇసుకతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచాల్సిన అధికారులు అనధికారికంగా అధిక లోడింగ్, అక్రమ రవాణా చేసుకుంటున్న కాంట్రాక్టర్లతో కలిసిపోయి దోపిడీలో భాగమవుతున్నారు. కాంట్రాక్టర్ల మేలు కోసం కొందరు అధికారులు జిల్లా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏ టా గోదావరి నది ప్రవాహం తగ్గుముఖం పట్టిన తర్వాత నదిలో ఎంత పరిమాణం లో ఇసుక ఉన్నది? ఎన్ని మీటర్ల లోతు వర కు ఇసుకను తీయవచ్చు? తవ్వకాలతో భూగర్భజలాలపై పడే ప్రభావం ఎంత? అనే అంశాలపై అధికారులు అధ్యయనం చే యాల్సి ఉంటుంది.
ఇసుక రీచ్‌లకు ఒకదానికి మరొక దానికి మధ్య కనీసం అర కిలో మీటర్ దూరం ఉండేలా క్వారీలను ఎంపిక చేసి జిల్లా ఉన్నతాధికారులకు ప్రతిపాదన లు పంపించాలి. నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతం లో క్వారీకి అనుమతులు ఇవ్వొద్దు. అయితే ములుగు జిల్లాలో ఈ నిబంధనలను పక్కనబెట్టారు. గోదావరి నది వెంట 200 మీటర్ల దూరం వరకు పక్క పక్కనే రీచ్‌లను ఎంపిక చేసి తవ్వకాలకు అనుమతులిస్తున్నారు. నీళ్లున్న ప్రాంతంలోనూ తవ్వకాలు జరిపేలా ప్రతిపాదనలు పెట్టారు. ఇసుక రీచ్‌ల కోసం ఏడాదిగా 50కి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని కాదని అధికార పార్టీలోని కీలక ప్రజాప్రతినిధులు చెప్పిన వారికి అనుమతులిచ్చారు. ఇందు కు సంబంధించిన ప్రాథమిక గుర్తింపు ప్ర క్రియ వివరాలను జిల్లా ఉన్నతాధికారుల కు సమర్పించలేదనే ఆరోపణలున్నాయి.