నంగునూరు, మార్చి 7: ‘రేవంత్రెడ్డి పొద్దంతా కాంగ్రెస్.. రాత్రి కాగానే బీజేపీ. రేవంత్, మోదీ కలిసి రైతులను ముంచిండ్రు. బడే భాయ్.. చోటే భాయ్ ఒకటైండ్రు. ఉచిత కరెంటు ఎత్తేసే కుట్ర జరుగుతున్నది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ఆలోచన చేస్తున్నరు’ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రైతు ధర్నా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్టులు పట్టుకొని నిరసన తెలిపారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ఇంటికి కంచె కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలు మూసీలో పోస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరికి వారు, ఎకడికక్కడ దోచుకుంటున్నారని విమర్శించారు. రైతు బంధు పథకాన్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ప్రజల మీద ప్రేమ ఉన్నందునే కేసీఆర్ అనేక పథకాలు తీసుకువచ్చారని గుర్తుచేశారు. రేవంత్రెడ్డి చెప్తున్న నిధుల కొరత ఒక సాకు మాత్రమేనని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూడు పంటలకు రైతు భరోసా ఇస్తామని ప్రగల్భాలు పలికాడని ఆరోపించారు.
మోసపోవుడు ప్రజల లక్షణమని పేర్కొన్న రేవంత్రెడ్డి చెప్పినట్టే చేశాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. రేవంత్రెడ్డి కేసీఆర్పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టిండని ఆరోపించారు. అమెరికా నుంచి పత్తి, సోయా, మకజొన్న దిగుమతి చేసుకునే ఒప్పందంపై ప్రధాని మోదీ సంతకం చేశారని మండిపడ్డారు. రూ.72 వేల కోట్లు.. 11 విడతల్లో రైతుబంధు సాయం అందించిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. చరిత్రలో రైతులకు డబ్బులు ఇచ్చిన ఏకైక నేత కేసీఆర్ అని గుర్తుచేశారు. ఈ ధర్నాలో సామాజిక విశ్లేషకులు పాపారావుతోపాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షడు అనగోని లింగం గౌడ్, మాజీ ఎంపీపీ జాపశ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.